కౌలు రైతులపై తొలిసారి కరుణ

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కౌలు రైతులకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో నష్టపోయిన రైతులతోపాటు కౌలు రైతులకు సైతం.

Updated : 24 Mar 2023 05:17 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా కౌలు రైతులకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగళ్లు, ఈదురు గాలులతో నష్టపోయిన రైతులతోపాటు కౌలు రైతులకు సైతం ఎకరాకు రూ.పది వేల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 12 లక్షల మంది కౌలురైతులు ఉన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో 30% వారే సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారికంగా వారి పేర్లు సాగుదారుల జాబితాలో నమోదవలేదు. ఎకరానికి రూ.పది వేల పంట పెట్టుబడులు కల్పించే రైతుబంధు పథకంలోనూ భూ యజమానులే లబ్ధిదారులుగా ఉన్నారు. రైతుబీమాలోనూ వీరు పేర్లు నమోదు కాలేదు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం అమలులో ఉన్నప్పుడు కూడా వారికి అది వర్తించలేదు. దీంతోపాటు ప్రతి ఏడాది జరిగే పంట నష్టాల్లోనూ వారి పేర్లను పరిగణనలోనికి తీసుకోవడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.28 లక్షల ఎకరాల్లోని పంటను సుమారు 96 వేల మంది రైతులు కోల్పోయారు. ఇందులో దాదాపు 35 వేల మంది కౌలుదారులు ఉన్నట్లు తెలుస్తోంది. మామిడి తోటల రైతుల్లో 80% కౌలు రైతులే ఉంటారు.
సర్వేలో కౌలు రైతుల కాలమ్‌: కౌలు రైతులకు సాయం అందనున్న నేపథ్యంలో రైతుల నుంచి సహకారం లభించేలా ఒప్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రతువులో ఆయా జిల్లాల కలెక్టర్లు కీలకంగా వ్యవహరిస్తారని సీఎం వెల్లడించారు. వ్యవసాయ శాఖ శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టనుంది. ఇందులో భూయజమానులతో పాటు కౌలుదారుల కాలమ్‌ కూడా చేర్చనుంది. ఎంత భూమిని కౌలుకు తీసుకున్నారు? ఎంత మేరకు నష్టం కలిగింది? వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ నంబరును సేకరిస్తారు. భూ యజమానులు, కౌలురైతుల మధ్య విభేదాలు తలెత్తితే గ్రామ స్థాయిలోనే పరిష్కారానికి ప్రయత్నించే వీలున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని