ఎకరాకు రూ.10వేల సాయంతో చరిత్ర సృష్టించారు: మంత్రి నిరంజన్‌రెడ్డి

వడగళ్ల వానతో పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ.పదివేల సాయం ప్రకటించి కేసీఆర్‌ మరోసారి చరిత్ర సృష్టించారని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్‌రెడ్డి అన్నారు. 

Updated : 24 Mar 2023 05:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: వడగళ్ల వానతో పంట నష్టపోయిన వారికి ఎకరాకు రూ.పదివేల సాయం ప్రకటించి కేసీఆర్‌ మరోసారి చరిత్ర సృష్టించారని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్‌రెడ్డి అన్నారు.  సీఎంతో గురువారం జిల్లాల పర్యటనకు వెళ్లి తిరిగి వచ్చిన ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ రైతులకు తీరని ద్రోహం చేస్తున్నా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆయనకు వత్తాసుగా మాట్లాడడం సిగ్గుచేటు. ఆయన అవగాహన, ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా పంటనష్టం కింద రైతులకు పైసా సాయం చేయలేదు. భాజపా పాలిత రాష్ట్రాల్లోనే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకం అమలు చేయడం లేదు. ప్రధాని సొంతరాష్ట్రం గుజరాత్‌లోనే దాన్ని ఎత్తేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని నాలుగేళ్లు అమలు చేసి.. బీమా సంస్థలకు రూ.2436.3 కోట్లు చెల్లిస్తే రైతులకు తిరిగి దక్కింది రూ.1821.1 కోట్లు. అందుకే ఈ పథకం నుంచి తెలంగాణ వైదొలిగింది. తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనమంటే కేంద్రం ‘మేం శాటిలైట్‌ ద్వారా చూశాం. అంత వరి తెలంగాణలో ఎక్కడ సాగు చేశారు?’ అని అపహాస్యం చేశారు. ఇప్పుడు సంజయ్‌ కేంద్రంతో శాటిలైట్‌ ద్వారా, గూగుల్‌ మ్యాప్‌ ద్వారా సర్వే చేయించి ఎంత పంట నష్టం జరిగిందో లెక్క తీసి కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకురావాలి’’ అని సవాల్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు