త్వరలో పోటీ పరీక్షల షెడ్యూలు ఖరారు!

ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది.

Published : 25 Mar 2023 05:31 IST

రద్దయిన, వాయిదాపడిన వాటికి కొత్త తేదీలు
వచ్చే రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షల రీషెడ్యూలు?

ఈనాడు, హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన వివిధ పోస్టుల పరీక్షలకు కొత్త షెడ్యూలును టీఎస్‌పీఎస్సీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటికే షెడ్యూలు చేసిన పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే అవకాశముంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీని రద్దు చేసిన రోజునే పునఃపరీక్ష తేదీని జూన్‌ 11గా వెల్లడించింది. అయితే... గ్రూప్‌-1తోపాటు రద్దయిన ఏఈఈ, డీఏవో, ఏఈ, వాయిదా పడిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాత పరీక్షలకు కొత్త తేదీలను ఖరారు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ, వివిధ పోటీ పరీక్షల షెడ్యూలును పరిశీలించి, టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు అనువైన తేదీలను వారంలోగా ప్రకటించనుంది. గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-4 పరీక్షలకు మధ్య వ్యవధిని పరిశీలించి, ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

ప్రొఫెషనల్‌ పోస్టులకు సీబీఆర్‌టీ పరీక్షలు

తక్కువ సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్న నోటిఫికేషన్ల రాతపరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) విధానంలో నిర్వహిస్తోంది. లీకేజీ నేపథ్యంలో మరింత భద్రతతోపాటు ఫలితాలను వేగంగా వెల్లడించేందుకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తోంది. ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన హార్టికల్చర్‌ అధికారులు, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, భూగర్భజల అధికారులు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, పాలిటెక్నిక్‌ లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్ల పరీక్షలను యధావిధిగా నిర్వహించాలా? ఆ లోగా కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధం అవుతాయా? తదితర విషయాలను పరిశీలిస్తోంది. అవసరమైతే వారం నుంచి 15 రోజుల వ్యవధితో వీటిని రీషెడ్యూలు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే వీటన్నింటినీ సీబీఆర్‌టీ పద్ధతిలో నిర్వహించాలని కమిషన్‌ యోచిస్తోంది. ఏఈఈ పోస్టులకు 81 వేల మంది, ఏఈ పోస్టులకు 74 వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ పోస్టుల్లో వివిధ కేటగిరీలు ఉన్నందున, ఆయా విభాగాల వారీగా సీబీఆర్‌టీ విధానంలోనే పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. తద్వారా పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో వేగం పెంచనుంది. గ్రూప్‌ సర్వీసుల ఉద్యోగాలకు సీబీఆర్‌టీ పద్ధతిలోనే విడతల వారీగా పరీక్షలు నిర్వహించి నార్మలైజేషన్‌ విధానంలో మార్కులను లెక్కించే విషయాన్ని పరిశీలిస్తోంది. ఈ అంశంపై అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీపై విధానం

టీఎస్‌పీఎస్సీలో సైబర్‌ సెక్యూరిటీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కమిషన్‌ పరిశీలిస్తోంది. వారం రోజులుగా ఐఐటీ హైదరాబాద్‌, జేఎన్‌టీయూ, ఉస్మానియా వర్సిటీల ఐటీ విభాగాధిపతులు, సైబర్‌ నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమైంది. సీబీఆర్‌టీ విధానంలో పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్‌ వ్యవహారాలు, సైబర్‌ సెక్యూరిటీ, అలర్ట్‌ సిస్టమ్‌ తదితర అంశాలను పరిశీలించింది. చేయాల్సిన మార్పులు, భద్రత విషయాలపై సూచనలు తీసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు