హామీల అమలు విధానమేంటో చెప్పండి?

హైదరాబాద్‌లో భూమిని ఉచితంగా కేటాయించడం వల్ల సాయి సింధు ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కేన్సర్‌ ఆస్పత్రిలో హామీల అమలుకు రూపొందించిన విధానాన్ని తెలపాలంటూ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Published : 25 Mar 2023 05:32 IST

సాయి సింధు ఫౌండేషన్‌కు భూకేటాయింపులపై హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భూమిని ఉచితంగా కేటాయించడం వల్ల సాయి సింధు ఫౌండేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కేన్సర్‌ ఆస్పత్రిలో హామీల అమలుకు రూపొందించిన విధానాన్ని తెలపాలంటూ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి 7 నక్షత్రాల కార్పొరేట్‌ ఆస్పత్రిలోకి పేదలు వెళ్లే సాహసం చేయగలరా అని ప్రశ్నించింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి ఖానామెట్‌లోని రూ.కోట్ల విలువైన 15 ఎకరాల భూమిని లీజు పేరుతో నామమాత్రపు ధరకు హెటెరో పార్థసారథిరెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్‌కు కేటాయింపును సవాలు చేస్తూ రైట్‌ సొసైటీ స్వచ్ఛంద సంస్థ, డాక్టర్‌ ఊర్మిళ పింగ్లేలు దాఖలు చేసిన వేర్వేరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ భూకేటాయింపు వ్యవహారంలో పారదర్శకత లేదన్నారు. ఇదే ప్రాంతంలో బసవతారకం ఆస్పత్రికి 30 ఏళ్ల క్రితం కేటాయింపు జరిగిందని, అప్పటి ధరలకు ఇప్పుడు కేటాయింపు సరికాదన్నారు. ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో 500 పడకల కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించి 1400 పడకలకు పెంచనున్నట్లు హెటెరో తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇందులో 25 శాతం మందికి ఉచితంగా వైద్యం అందిస్తారని, 2 వేల మందికి వసతి కల్పిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ  భూ కేటాయింపులకు ప్రతిగా పేదలకు ఉచిత వైద్యం అందించాల్సి ఉందన్నారు. ఫౌండేషన్‌ ఇచ్చిన హామీల అమలు పర్యవేక్షణ విధానమేమిటో చెప్పాలంటూ ధర్మాసనం విచారణను ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు