రూ.12,718 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది

విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు గత ఏడేళ్లుగా ఖర్చుపెట్టిన అదనపు సొమ్ము రూ.12,718.48 కోట్లను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేయవద్దని సూచిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.

Published : 25 Mar 2023 05:33 IST

కరెంటు ట్రూఅప్‌ ఛార్జీల భారం ప్రజలపై వేయం
ప్రార్థనా మందిరాల కరెంటు బిల్లు ఇక యూనిట్‌కు రూ.5
రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు గత ఏడేళ్లుగా ఖర్చుపెట్టిన అదనపు సొమ్ము రూ.12,718.48 కోట్లను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేయవద్దని సూచిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అదనంగా ఖర్చుచేసిన మొత్తాన్ని ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రజల కరెంటు బిల్లుల ద్వారా వచ్చేనెల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని రెండు నెలల క్రితం డిస్కంలు ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’ (ఈఆర్‌సీ)కి ప్రతిపాదనలిచ్చాయి. వీటిపై తుది నిర్ణయాన్ని ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు శుక్రవారం వెల్లడించారు. ఈ ట్రూఅప్‌ ఛార్జీల వసూలుకు అనుమతించవద్దని, ఈ సొమ్మునంతా రాబోయే అయిదేళ్ల పాటు వాయిదాల్లో వడ్డీతో చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు తమకు అందాయని ఆయన చెప్పారు. ఈఆర్‌సీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజలపై భారం వేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన వివరించారు. ప్రస్తుతం అన్ని మతాల ప్రార్థనామందిరాలకు సరఫరా చేస్తున్న కరెంటుకు యూనిట్‌కు రూ.6.40 నుంచి రూ.7 వరకూ ఛార్జీని డిస్కంలు వసూలు చేస్తున్నాయని, దీనిని వచ్చే నెల నుంచి యూనిట్‌కు రూ.5కి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఈఆర్‌సీ సభ్యులు మనోహర్‌రాజు, కృష్ణయ్యలు కూడా పాల్గొన్నారు. శ్రీరంగారావు తెలిపిన మరికొన్ని ముఖ్యాంశాలు...

* ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్‌సీ అనుమతించిన పరిమితికన్నా అదనంగా కరెంటు కొనుగోలుకు సొమ్మును డిస్కంలు ఖర్చుపెడితే దానిని అదనంగా కరెంటు బిల్లుల నుంచి వసూలు చేసేందుకు మరుసటి ఏడాది ఇచ్చే ప్రతిపాదనలను ‘ట్రూఅప్‌ ఛార్జీలు’ అని పిలుస్తారు. ఇలా 2016-22 మధ్యకాలంలో మొత్తం కరెంటు కొనుగోళ్లకు రూ.12,015 కోట్లు, పంపిణీ ఖర్చుల కింద రూ.4578 కోట్లు (మొత్తం 16,593 కోట్లు) ఖర్చుపెట్టామని, వీటిని ట్రూఅప్‌ పేరుతో వచ్చే నెల నుంచి వసూలుకు అనుమతించాలని డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనల్లో తెలిపాయి. కానీ ఈఆర్‌సీ ఈ ప్రతిపాదనలను లోతుగా పరిశీలిస్తే డిస్కంలు కరెంటు కొనుగోలుకు, పంపిణీకి అదనంగా ఖర్చుపెట్టిన సొమ్ము రూ.12,718.48 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ మొత్తాన్ని అయిదేళ్ల పాటు 5 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినందున ఇక ప్రజలపై భారం ఏమీ వేయవద్దని డిస్కంలను ఆదేశించాం.

* రాష్ట్రంలో కొన్ని వర్గాల వారికి ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న కరెంటు ఛార్జీల రాయితీ పద్దు కింద 2015-16లో రూ.4257.28 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా భరించగా వచ్చే ఏడాది (2023-24)లో రూ.9124.82 కోట్లు ఇవ్వనుంది.

* డిస్కంలు కరెంటు కొనుగోలుకు ప్రస్తుత ఏడాది (2022-23)లో యూనిట్‌కు సగటున రూ.4.49 చొప్పున ఖర్చుచేయాలని అనుమతించగా వచ్చే ఏడాది (2023-24)లో అది రూ.4.39కి తగ్గుతుందని ఈఆర్‌సీ అంచనా వేసింది. సౌరవిద్యుత్‌ అందుబాటులోకి వస్తున్నందున సగటు వ్యయం తగ్గుతుంది.

* ఇలాగే రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి కలిపి ఒక యూనిట్‌ కరెంటు సరఫరాకు సగటు వ్యయం (ఏసీఎస్‌) రూ.7.03 ఉండగా వచ్చే ఏడాదికి రూ.7.02కి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం.

* డిస్కంలు అధిక ధరలకు కరెంటు కొని సరఫరా చేస్తున్నాయి. ప్రజలు పొదుపుగా వాడుకుంటే వారికి, డిస్కంలపైనా ఆర్థికభారం తగ్గుతుంది.

* ప్రభుత్వం భారీస్థాయిలో రూ.12,718 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలను, రాయితీ కింద మరో రూ.9124 కోట్లను ఇస్తున్నందున వచ్చే ఏడాది నుంచి డిస్కంలు అంతర్గత సామర్థ్యం పెంచుకుని, ఇకనుంచి ఆర్థిక అవసరాలకు ప్రభుత్వంపై ఆధారపడకుండా పనిచేయాలి.

* వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద డిస్కంలు తప్పనిసరిగా మీటర్లు పెట్టి ఎంత కరెంటు సరఫరా చేస్తున్నారో లెక్కించాలి.

* ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకున్న కరెంటు నెలవారీ బిల్లుల బకాయిలు రూ.21 వేల కోట్లకు చేరాయి. వాటిని వసూలు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని