TSPSC paper leak case: భయపడి.. డిస్‌క్వాలిఫై చేసుకున్న ప్రవీణ్‌?

గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కొట్టేసిన టీఎస్‌పీఎస్సీలోని ఇంటి దొంగలు.. పరీక్ష రాయడంలోనూ తెలివితేటలు ప్రదర్శించారు. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడతాయని, అసలుకే ఎసరు వస్తుందని వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

Updated : 25 Mar 2023 09:47 IST

అందుకే ఓఎంఆర్‌ షీట్‌పై డబుల్‌ బబ్లింగ్‌
వ్యూహాత్మకంగా వ్యవహరించిన గ్రూప్‌-1 రాసిన ఇతర నిందితులు
పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కొట్టేసిన టీఎస్‌పీఎస్సీలోని ఇంటి దొంగలు.. పరీక్ష రాయడంలోనూ తెలివితేటలు ప్రదర్శించారు. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడతాయని, అసలుకే ఎసరు వస్తుందని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మంచి మార్కులు తెచ్చుకోవడంతో సరిపెట్టుకున్నారు. ప్రశ్నపత్రాలను ముందుగానే చేజిక్కించుకున్న ప్రవీణ్‌, రాజశేఖర్‌లు మొదటి నుంచీ పక్కా పథకం ప్రకారమే నడుచుకున్నారు. 103 మార్కులు తెచ్చుకున్న ప్రవీణ్‌.. తన వ్యక్తిగత వివరాలు నింపే పత్రంలో డబుల్‌ బబ్లింగ్‌ చేయడం కూడా దీనిలో భాగమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగులు 20 మంది రాయగా.. వారిలో 8 మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో షమీమ్‌, సురేష్‌, రమేష్‌లకు వందకుపైగా మార్కులు వచ్చాయి. షమీమ్‌కు అత్యధికంగా 127 మార్కులు వచ్చాయి. ఈ ముగ్గురూ ప్రవీణ్‌, రాజశేఖర్‌ల ద్వారా ప్రశ్నపత్రాన్ని ముందుగానే పొందారన్న ఆరోపణపై సిట్‌ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షకు ముందే వీరికి ప్రశ్నపత్రం అందినందున.. వీరు 150కి 150 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే దొరికిపోతామన్న ఉద్దేశంతో కొంచెం తక్కువ మార్కులు వచ్చేలా రాశారని పోలీసులు భావిస్తున్నారు.

కమిషన్‌ నిబంధనల ప్రకారం ఎవరికైనా వందశాతం లేక అసాధారణ స్థాయిలో మార్కులు వస్తే.. వారిపై విచారణ చేయడంతోపాటు అవసరమైతే పోలీసులతోనూ దర్యాప్తు చేయిస్తారు. ఈ నిబంధన కమిషన్‌లో పనిచేస్తున్న ఆ ముగ్గురుకీ తెలుసు. వీరికి గరిష్ఠంగా మార్కులు వస్తే కమిషన్‌ అధికారులకూ అనుమానం వచ్చే అవకాశం ఉంది.

ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. కానీ వ్యక్తిగత వివరాలు నింపే ఓఎమ్మార్‌ షీట్‌లో డబుల్‌ బబ్లింగ్‌ చేయడంతో అనర్హుడయ్యాడు. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ప్రారంభానికి ముందే.. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలను ఓఎమ్మార్‌ పత్రంలో నమోదు చేయించి, ఇన్విజిలేటర్‌ సంతకం చేస్తారు. ఎవరైనా ఇందులో తప్పులు చేస్తే గుర్తించి, ఆ పత్రం తీసుకొని మరొకటి ఇస్తారు. ప్రవీణ్‌ పరీక్ష రాయడానికి ముందే తప్పుగా నింపి ఉంటే ఇన్విజిలేటర్‌కు తెలిసిపోయేది. అప్పుడు ఇంకోటి ఇచ్చేవారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. అంటే తొలుత ప్రవీణ్‌ ఓఎమ్మార్‌ షీట్‌ బాగానే నింపి ఉంటాడు. పరీక్ష పూర్తయ్యాక.. తనకు ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి.. అంతా అనుమానించే అవకాశం ఉందని భయపడి, తనకు తాను డిస్‌క్వాలిఫై అయ్యేలా ఓఎమ్మార్‌ షీట్‌లో మరోమారు బబ్లింగ్‌ చేసి ఉంటాడని భావిస్తున్నారు.

పోలీసులను నమ్మించే ఎత్తుగడ..

టౌన్‌ప్లానింగ్‌ ప్రశ్నపత్రం లీక్‌ అయిందన్న ఫిర్యాదుపై ప్రవీణ్‌, రేణుకలను అదుపులోకి తీసుకోగా.. తాము ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీక్‌ చేశామని నమ్మించేందుకు ప్రయత్నించారు. కొంతతప్పు ఒప్పుకొని.. అంతకుమించి ఏమీ లేదని పోలీసులను నమ్మించేందుకు నేరస్థులు అవలంబించే మామూలు ఎత్తుగడ ఇది. పట్టుకోగానే ఏఈ ప్రశ్నపత్రం లీక్‌ అయిందని ఒప్పుకోవడం ద్వారా సిట్‌ అధికారులు అక్కడితో ఆగిపోతారని నిందితులు భావించి ఉంటారు. తవ్వే కొద్దీ గ్రూప్‌-1తోపాటు మొత్తం నాలుగు పేపర్లు లీక్‌ అయినట్లు వెల్లడైంది. ఇక విచారణ సమయంలో ఎంత ప్రయత్నించినా ప్రవీణ్‌ నోరు మెదపలేదు. తనకు యూజర్‌ఐడీ, పాస్‌వర్డ్‌ ఎలా వచ్చాయన్న విషయాన్ని రాజశేఖర్‌ వెల్లడించలేదు. శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించినట్లు దర్యాప్తులో పోలీసులే తెలుసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు