ఆర్టీసీ నుంచి ఏసీ స్లీపర్‌ బస్సులు

ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధం అవుతోంది. ఇందుకోసం 16 బస్సులను కొనుగోలు చేసింది. వీటిని సోమవారం(ఈ నెల 27న) ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 25 Mar 2023 03:29 IST

27న ప్రారంభానికి ఏర్పాట్లు
16 బస్సులు కొనుగోలు చేసిన సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌: ఏసీ స్లీపర్‌ బస్సులను ప్రవేశపెట్టేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధం అవుతోంది. ఇందుకోసం 16 బస్సులను కొనుగోలు చేసింది. వీటిని సోమవారం(ఈ నెల 27న) ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు, హుబ్బళ్లి నగరాలకు ఈ బస్సులను నడిపేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

విభజన జరగక ముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ, గుంటూరు వంటి నగరాలకు ‘వెన్నెల’ పేరుతో ఏసీ స్లీపర్‌ బస్సులు నడిచాయి. రాష్ట్ర ఆవిర్భావం.. ఏపీఎస్‌ఆర్టీసీ నుంచి విడిపోయి టీఎస్‌ఆర్టీసీ ఏర్పడినప్పటి నుంచి ఏసీ స్లీపర్‌ బస్సులు లేవు. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు హైదరాబాద్‌ నుంచి ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు వందల సంఖ్యలో ఏసీ స్లీపర్‌ బస్సులు నడిపిస్తున్నారు. నిద్ర పోయేందుకు బెర్తులు ఉండటంతో ఈ బస్సులకు మంచి ఆదరణ ఉంది. ఈ అవకాశాన్ని టీఎస్‌ఆర్టీసీ ఆలస్యంగా అందిపుచ్చుకుంది. ‘లహరి’ పేరుతో కొంతకాలం క్రితం నాన్‌ ఏసీలో 12 స్లీపర్‌, హైబ్రిడ్‌ (కొన్ని బెర్తులు, కొన్ని సీట్లు) ప్రవేశపెట్టింది. వీటిని టీఎస్‌ఆర్టీసీ అద్దెకు తీసుకుని విజయవాడ, కాకినాడకు నడుపుతోంది. ఏసీ స్లీపర్‌ బస్సులను మాత్రం అశోక్‌ లైలాండ్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఒక్కో బస్సుకు రూ.55 లక్షలు వెచ్చిస్తోంది. ఇప్పటికే 4 బస్సులు రాగా శనివారం మరో నాలుగు మిగిలినవి నెలాఖరుకు రానున్నట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని