ఎల్బీనగర్‌ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు

మెట్రో రైలును హయత్‌నగర్‌ వరకు పొడిగిస్తామని, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 26 Mar 2023 04:57 IST

కొత్త ఫ్లై ఓవర్‌కు ‘మాల్‌మైసమ్మ’గా నామకరణం
ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: మెట్రో రైలును హయత్‌నగర్‌ వరకు పొడిగిస్తామని, రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోయేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎల్బీనగర్‌లో కొత్తగా నిర్మించిన పైవంతెనను స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఎల్బీనగర్‌ చౌరస్తాకు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి పేరును, కొత్త పై వంతెనకు స్థానిక దేవత మాల్‌మైసమ్మ ఫ్లై ఓవర్‌గా నామకరణం చేస్తామన్నారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో మొత్తం 12 ప్రాజెక్టులను ప్రారంభించగా.. 9 పూర్తి చేశామని, బైరామల్‌గూడలో మిగిలిన 3ప్రాజెక్టులను సెప్టెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌కు మెట్రో విస్తరణ పనులు త్వరలో పూర్తి చేస్తామని, భవిష్యత్తులో హయత్‌నగర్‌కు, ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌కు మెట్రోను అనుసంధానం చేస్తామన్నారు. ఎల్బీనగర్‌లో రూ.1200 కోట్లతో నిర్మించబోయే టిమ్స్‌ ఆసుపత్రిని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు. వరదల సమయంలో ఎల్బీనగర్‌లో స్వయంగా పర్యటించాక.. ఎస్‌ఎన్‌డీపీ పనులు ప్రారంభించామని, వర్షాకాలంలోపు రూ.980 కోట్లతో పనులు పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటోనగర్‌లో డంపింగ్‌ యార్డు సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, దయానంద్‌గుప్తా, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, టీఎస్‌ రెడ్కో ఛైర్మన్‌ సతీష్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ పంకజ, టూరిజం శాఖ మాజీ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, భారాస నాయకుడు రామ్మోహన్‌గౌడ్‌, కార్పొరేటర్లు దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు