ఉద్యోగాలిచ్చే బాధ్యత మాదే

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిబాటలో సాగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికే పరిపాలనా పాఠాలు చెప్పే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు.

Published : 26 Mar 2023 04:57 IST

దేశానికి తెలంగాణ పరిపాలనా పాఠాలు
పెద్దఅంబర్‌పేట్‌ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్‌
ప్రతిపక్షాల మాయలో పడొద్దని నిరుద్యోగులకు సూచన

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిబాటలో సాగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికే పరిపాలనా పాఠాలు చెప్పే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. ఈ మాటను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిందన్నారు. పార్టీ నేత, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కుమారుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పెద్దఅంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. ప్రశాంత్‌కుమార్‌రెడ్డి 63 రోజులపాటు 771 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై నివేదిక అందించినట్లు తెలిపారు. ఆయా సమస్యలను పరిష్కరించే బాధ్యతను తమపై పెట్టారని అభినందించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ప్రశ్నపత్రం లీకైనట్లు గుర్తించిన వెంటనే పరీక్షలు రద్దు చేశామని, త్వరలో తిరిగి నిర్వహిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు. బాధ్యులను విడిచిపెట్టేది లేదన్నారు. కొందరు వెంటనే తనను రాజీనామా చేయాలని, బర్తరఫ్‌ చేయాలంటున్నారని, అది ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని, విద్యాశాఖకు, ఐటీశాఖకు సంబంధం లేదన్నారు. పొరపాట్లను సవరించుకొని ముందుకువెళ్తామన్నారు. జరిగిన నష్టానికి తామంతా చింతిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదని, చిల్లర మనుషుల కుట్రలో చిక్కుకోవద్దని కోరారు. నిరుద్యోగులపై ప్రతిపక్షాల కంటే ఎక్కువ ప్రేమ సీఎం కేసీఆర్‌కే ఉందన్నారు. ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణలో జరిగినన్ని ఉద్యోగ నియామకాలు దేశంలో ఎక్కడైనా జరిగాయా అని ప్రశ్నించారు.

మరిన్ని ఉపాధి అవకాశాలు

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగర కలాన్‌లో 200 ఎకరాల్లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ రాబోతోందని, మే నెలలో పనులు మొదలవుతాయన్నారు. దీంతో హైదరాబాద్‌ చుట్టుపక్కల లక్ష మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు. యాచారం, మంచాలలో పరిశ్రమలు రావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరుతున్నారన్నారు. తన స్వగ్రామం ఎల్మినేడులో ఏరోస్పేస్‌ రంగానికి చెందిన పరిశ్రమ కావాలంటున్నారని, ఇవన్నీ మీకు ఉద్యోగాలు రావాలనే తాపత్రయంతోనే అడుగుతున్నారన్నారు. పాలమూరు- రంగారెడ్డి పథకం ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరందించేందుకు కాల్వలు తవ్వుతున్నామని, రిజర్వాయర్లు కడుతున్నామని కేటీఆర్‌ వివరించారు. స్థానిక కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోతులను పట్టుకొని ఫొటోలు దిగుతున్నారని, దేశమంతటా ఉన్న కోతుల సమస్య.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాల్లోనే ఎక్కువుందని చమత్కరించారు. ఇబ్రహీంపట్నంలో పోటీకి తహతహలాడుతున్న కాంగ్రెస్‌ నేత ఎల్బీనగర్‌ బస్సుల అడ్డాలో ఏం చేశారో తెలుసని ఎద్దేవా చేశారు.

ఒక్క ఛాన్స్‌ అని ఒకరు.. మిత్రోం అంటూ మరొకరు..

ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలంటున్న కాంగ్రెస్‌ నాయకులకు ప్రజలు గతంలో 50 ఏళ్లు అధికారం ఇచ్చినా కరెంటు, మంచినీళ్లు ఇవ్వడం వారికి చేతకాలేదన్నారు. 2014లో ప్రధాని మోదీ మిత్రోం.. అంటూ జన్‌ధన్‌ ఖాతాలు తెరవండి.. రూ.15 లక్షల చొప్పున ఖాతాల్లో వేస్తానని చెప్పలేదా.. ఒక్కరికైనా ఆ సొమ్ము వేశారా అని ప్రశ్నించారు. మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్నారని, అంటే తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలివ్వాల్సి ఉండగా 18 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. భాజపా నాయకులు నిరుద్యోగ మార్చ్‌ అంటున్నారని, అది దిల్లీలో మోదీ ఇంటి ముందు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ సభలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎల్‌.రమణ, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ అనితారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు క్యామ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని