‘Time of Day’ tariff: కొత్తరకం కరెంట్‌ షాక్‌!

రోజూ ఏదో ఒక సమయంలో విద్యుత్‌ వినియోగ డిమాండ్‌ అత్యధికంగా ఉంటుంది. ఆ సమయంలో వాడే కరెంట్‌కు 10 నుంచి 20 శాతం ఛార్జీలు పెంచాలని కేంద్ర విద్యుత్‌శాఖ నిర్ణయించింది.

Updated : 26 Mar 2023 08:23 IST

గరిష్ఠ డిమాండ్‌ సమయంలో వినియోగిస్తే అధిక ఛార్జీ
పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 20%
సాధారణ వినియోగదారులకు 10% వడ్డింపు
‘టైం ఆఫ్‌ డే’ పేరుతో కేంద్రం నూతన విధానం
14లోగా అభ్యంతరాలు తెలపాలని సూచన
ఈనాడు - హైదరాబాద్‌

రోజూ ఏదో ఒక సమయంలో విద్యుత్‌ వినియోగ డిమాండ్‌ అత్యధికంగా ఉంటుంది. ఆ సమయంలో వాడే కరెంట్‌కు 10 నుంచి 20 శాతం ఛార్జీలు పెంచాలని కేంద్ర విద్యుత్‌శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ‘టైం ఆఫ్‌ డే’ (టీఓడీ) పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. గరిష్ఠ డిమాండ్‌ ఉన్న సమయం (టీఓడీ)లో కరెంట్‌ వాడే పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు 2024 ఏప్రిల్‌ 1లోగా 20 శాతం, ఇతర వర్గాల వినియోగదారులకు 2025 ఏప్రిల్‌ 1లోగా 10 శాతం ఛార్జీలను పెంచి వసూలు చేయాలని నిర్దేశించింది. గరిష్ఠ డిమాండ్‌ ఉన్న సమయాలను ప్రజలకు తెలపాలని స్పష్టం చేసింది. అలానే రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ ఎండ కాచే సమయంలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో వాడే విద్యుత్‌కు ఛార్జీలను 20 శాతం తగ్గించాలని పేర్కొంది. ఈమేరకు వినియోగదారుల హక్కుల నియమావళికి సవరణలు చేస్తూ ముసాయిదా ప్రతిపాదనలను శనివారం అన్ని రాష్ట్రాలకు పంపింది. అభ్యంతరాలుంటే వచ్చే నెల 14లోగా ఈమెయిల్‌ ద్వారా పంపాలని పేర్కొంది.

ఉదయం 6 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 వరకు అధిక వినియోగం

కరెంట్‌ వినియోగం రోజులో ఒక్కో సమయంలో ఒక్కో తీరుగా ఉంటుంది. తెలంగాణలో శనివారం మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాలకు అత్యధికంగా 13,970 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. రాత్రి 10 గంటలకు డిమాండ్‌ 8 వేల మెగావాట్లకు పడిపోయింది. సాధారణంగా వ్యవసాయ మోటార్లు, పరిశ్రమలు, వీధిదీపాలు, ఇళ్లలో వినియోగం కారణంగా.. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో రోజూ ఉదయం 6 నుంచి 12 వరకు, సాయంత్రం 6 నుంచి 9 వరకూ గరిష్ఠ డిమాండ్‌ ఉంటోంది. ఈ సమయాల్లో కోతలు లేకుండా సరఫరా చేయడానికి పంపిణీ సంస్థ (డిస్కం)లు ఇంధన ఎక్స్ఛేంజిలో యూనిట్‌కు రూ.12 చెల్లించి కరెంట్‌ కొంటున్నాయి. దీంతో వాటిపై రూ.వేల కోట్ల అదనపు భారం పడుతోంది. గరిష్ఠ డిమాండ్‌ కొంత సమయం మాత్రమే ఉండి, తర్వాత అందులో సగానికి పడిపోతున్నందున కరెంట్‌ సరఫరా గ్రిడ్‌ నిర్వహణ కూడా సమస్యాత్మకంగా మారుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి టీఓడీ విధానాన్ని తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం  తెలిపింది.

ముసాయిదాలో పేర్కొన్న ఇతర అంశాలు..

* అన్ని కనెక్షన్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలి. తమ కరెంట్‌ రీడింగ్‌ను వినియోగదారులు మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో చూసుకునే అవకాశం కల్పించాలి. ప్రతినెలా విద్యుత్‌ బిల్లును ఎస్‌ఎంఎస్‌, యాప్‌ ద్వారా వారికి నేరుగా పంపించాలి.

* టీఓడీ కింద అదనపు ఛార్జీలను ఏ సమయంలో ఎంత వసూలు చేయాలనే అంశాన్ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయిస్తుంది. గరిష్ఠ డిమాండ్‌ సమయాన్ని నిర్ణయించే క్రమంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని కూడా ఈఆర్‌సీ దృష్టిలో ఉంచుకోవాలి. టీవోడీలో కేటగిరీల వారీగా వసూలు చేసే అదనపు ఛార్జీ వివరాలను డిస్కంలు తమ వెబ్‌సైట్‌లో స్పష్టంగా తెలపాలి.

* కనెక్షన్‌ ఇచ్చే ముందు ఎంత లోడుతో ఇచ్చేది నిర్ణయిస్తారు. స్మార్ట్‌మీటర్‌ పెట్టాక.. ఆ లోడుకన్నా ఎక్కువ నమోదైతే మరుసటి నెలలో ‘గరిష్ఠ డిమాండ్‌ లోడు’ పేరుతో జరిమానా వసూలు చేయకూడదు. ఒక నెలలో అదనపు లోడు నమోదైతే.. అంతకుముందు మూడు నెలల సగటు లోడును లెక్కించాలి. ఈ సగటు కూడా కనెక్షన్‌ ఇచ్చినప్పుడు మంజూరు చేసినదానికన్నా ఎక్కువగా ఉంటే మరుసటి క్యాలెండర్‌ ఏడాదిలో మాత్రమే అదనపు రుసుం వసూలు చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని