ప్రాజెక్టుల అదనపు వ్యయాలకు ఆమోదం?

రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో అదనంగా చేయాల్సి వచ్చిన పనులు, గడువు పొడిగింపు, పెరిగిన అంచనాలకు నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

Updated : 26 Mar 2023 04:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల్లో అదనంగా చేయాల్సి వచ్చిన పనులు, గడువు పొడిగింపు, పెరిగిన అంచనాలకు నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నేతృత్వంలోని రాష్ట్రస్థాయి స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అదనపు టీఎంసీ పనులకు సంబంధించి కంట్రోల్‌ బ్లాస్టింగ్‌, కాంక్రీటును అదనంగా వినియోగించడం వంటి కారణాలతో పెరిగిన వ్యయాన్ని చెల్లించడానికి కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. అన్నారం బ్యారేజీ నిర్మాణంలో రూ.79 కోట్లు ఆదా అయ్యాయని, వాటిని డ్యాం దిగువన అవసరమైన మరమ్మతులకు వినియోగించుకోవడానికి ప్రతిపాదించగా... కమిటీ అంగీకరించినట్లు సమాచారం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని 14వ ప్యాకేజీ సవరించిన అంచనాకు కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మకు నీటిని మళ్లించే ఈ పని విలువ రూ.2,895 కోట్ల నుంచి రూ.3,092 కోట్లకు పెరిగింది. పనిలో అదనం ఏమీ లేకపోగా రూ.35 కోట్లు తగ్గినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పన్నులు రూ.128 కోట్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థకు సంబంధించిన పనుల అంచనా వ్యయం రూ.185 కోట్ల నుంచి రూ.230 కోట్లకు పెరిగినట్లు తెలిసింది. వీటివల్ల వ్యయం అదనంగా రూ.197 కోట్లు పెరగడంతో దీనికి కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఓ ప్యాకేజీ గడువు పొడిగింపునకు అంగీకరించినట్లు తెలిసింది. ఈ పని సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. భూసేకరణ సమస్యతో కొంత ఆయకట్టుకు నీటినిచ్చే పనులు ఆగిపోయాయి. నాలుగైదు నెలల్లో పని పూర్తి చేయాలని, లేదంటే ఆపేయాలని కమిటీ అభిప్రాయపడినట్లు తెలిసింది. నిజామాబాద్‌, అదిలాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలపై కూడా కమిటీ చర్చించినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని