వివేకానందరెడ్డి హత్యకేసులో... శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ పిటిషన్‌పై సాక్ష్యం నమోదు

వివేకా హత్యకేసులో తన భర్త దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అన్యాయంగా ఇరికించే యత్నం చేస్తున్నారని.. ఈ కేసులో తాను అనుమానిస్తున్న కొందరు వ్యక్తులను విచారించాలంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ గతేడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.

Updated : 26 Mar 2023 04:49 IST

పులివెందుల, న్యూస్‌టుడే: వివేకా హత్యకేసులో తన భర్త దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అన్యాయంగా ఇరికించే యత్నం చేస్తున్నారని.. ఈ కేసులో తాను అనుమానిస్తున్న కొందరు వ్యక్తులను విచారించాలంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ గతేడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ మేరకు సాక్షిగా వివేకా పీఏ కృష్ణారెడ్డితో శనివారం ఇక్కడి న్యాయస్థానంలో న్యాయమూర్తి పవన్‌కుమార్‌ ఎదుట సాక్ష్యం నమోదు చేశారు. ఈ సందర్భంగా పిటిషనర్‌ తులశమ్మ తరఫున హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జానకీరామ్‌ రామిరెడ్డి, న్యాయవాది కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు తప్పుదోవ పడుతోందని, అన్యాయంగా తన భర్తను ఈ కేసులో ఇరికించారంటూ తులశమ్మ పిటిషన్‌ వేసినట్లు గుర్తుచేశారు. వివేకా హత్యకేసులో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వర్‌రెడ్డి, తెదేపా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌ రవి), వైజీ రాజేశ్వర్‌రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ను విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె ఆ పిటిషన్‌లో పొందుపరిచినట్లు వివరించారు. వివేకా రెండో వివాహం చేసుకున్నారని...  రెండోభార్యకు, వారికి పుట్టిన కుమారుడికి ఆస్తి పంచిస్తారనే ఉద్దేశంతో ఈ హత్య చేయించి ఉంటారన్న కోణంలో పైన తెలిపిన అనుమానితులపై విచారణ చేపట్టాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వివరించారు. వివేకా హత్య జరిగిన రోజు దొరికిన లేఖను దాచిపెట్టడం, ఆ తరువాత హత్య సంఘటన ప్రాంతంలో వివేకా అనుచరుడు, నిందితుడు ఎర్రగంగిరెడ్డి రక్తపు మరకలను తుడిచి వేయించడం తదితర విషయాలపై తులశమ్మ అనుమానం వ్యక్తం చేశారన్నారు. ఆ మేరకు విచారణ సాగించే దిశగా ఆమె తరఫున ఉన్న సాక్షుల్లోని వ్యక్తుల్లో వివేకా పీఏ కృష్ణారెడ్డి న్యాయస్థానంలో హాజరయ్యారన్నారు. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న మరో ఇద్దరు సాక్షులతో న్యాయమూర్తి సాక్ష్యం నమోదు చేస్తారని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు