మృతదేహాలు తారుమారు!.. స్వగ్రామాలకు తీసుకెళ్లాక గుర్తింపు

కడసారి చూపు కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువులకు ఆసుపత్రి మార్చురీ సిబ్బంది ఓ మృతదేహాన్ని అప్పగించారు.

Published : 26 Mar 2023 04:38 IST

పోస్టుమార్టం అధికారులు, పోలీసుల నిర్లక్ష్యం
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఘటన

ఎంజీఎం ఆసుపత్రి, స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: కడసారి చూపు కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు, బంధువులకు ఆసుపత్రి మార్చురీ సిబ్బంది ఓ మృతదేహాన్ని అప్పగించారు. వాటిని తీవ్రవిషాదంతో ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహంపై కప్పిన వస్త్రాన్ని తొలగించి చూసిన బంధువులు కంగుతిన్నారు. ఇది తమది కాదని తెలుసుకుని ఆసుపత్రి సిబ్బందికి అప్పగించారు. చివరికి అధికారులు ఆ మృతదేహాలను సంబంధిత కుటుంబసభ్యులకు అప్పగించాల్సి వచ్చింది. పోస్టుమార్టం అధికారులు, మార్చురీ సిబ్బంది, పోలీసుల నిర్లక్ష్యంతో మృతదేహాలు తారుమారైన ఈ ఘటన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా వంగర మండల కేంద్రానికి చెందిన ఆశాడపు పరమేశ్వర్‌(53) ఈ నెల 22న రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎల్కతుర్తి క్రాస్‌రోడ్డులో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రగాయాలపాలైన పరమేశ్వర్‌ వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తానేధార్‌పల్లి గ్రామానికి చెందిన రాగుల రమేష్‌ (40) ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. కుటుంబసభ్యులు వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం మృతి చెందారు. వీరిద్దరి మృతదేహాలకు శనివారం ఎంజీఎం ఆవరణలోని మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం సిబ్బంది, పోలీసులు.. అక్కడే ఉన్న ఇరు కుటుంబాలకు మృతదేహాలను అప్పగించారు. రెండు కుటుంబాల వారు మృతదేహాలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఆ తర్వాత తీసుకొచ్చినవి తమవారి మృతదేహాలు కాదని గుర్తించి ఖిన్నులయ్యారు. వెంటనే పోలీసులు, వైద్యాధికారులకు సమాచారం ఇవ్వగా ఆయా గ్రామాల నుంచి అంబులెన్సుల్లో మృతదేహాలను వెనక్కి తెప్పించి సంబంధీకులకు అప్పగించారు. అనంతరం కుటుంబసభ్యులు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్‌ చంద్రశేఖర్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రాగానే ఎవరి మృతదేహాలను వారికి ఇప్పించామన్నారు. ఈ ఘటనలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు