కుటుంబాల కంటే వాహనాలే అధికం

తెలంగాణలో ఏటేటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కోటీ 20 లక్షల కుటుంబాలుండగా వాహనాల సంఖ్య కోటీ 53 లక్షలు దాటింది.

Published : 27 Mar 2023 05:03 IST

రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల వాహనాలు
అందులో 86 శాతానికి పైగా కార్లు, మోటారు సైకిళ్లే
రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ట్రాక్టర్లు
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణలో ఏటేటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కోటీ 20 లక్షల కుటుంబాలుండగా వాహనాల సంఖ్య కోటీ 53 లక్షలు దాటింది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్‌ 2వ తేదీ నాటికి 71.52 లక్షల వాహనాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 1.53 కోట్లు దాటగా.. ఇందులో ద్విచక్ర వాహనాలు 73.7 శాతం, కార్లు 13 శాతం ఉన్నాయి. వీటి తర్వాతి స్థానం ట్రాక్టర్లదే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాలు కలిపి రోజూ కొత్తగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఓవైపు వ్యక్తిగత వాహనాలు పెద్దఎత్తున పెరుగుతుండగా.. అదే సమయంలో ప్రజారవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు మాత్రం 10,479 నుంచి 9,164కి అంటే 12.5 శాతం తగ్గాయి. మరోవైపు వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు భారీ ఆదాయం వస్తోంది. తొమ్మిదేళ్లలో 320 శాతం, నిరుటితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి పైగా ఆదాయం పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే రికార్డు. కొత్త రాష్ట్రంలో సంపద సృష్టి, కుటుంబాల ఆదాయంలో భారీ వృద్ధి ఫలితంగానే వాహనాల సంఖ్య పెరుగుతోందని రవాణాశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

258% పెరిగిన ట్రాక్టర్లు

రాష్ట్రంలో ట్రాక్టర్లు, ట్రైలర్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. తొమ్మిదేళ్లలో 2.69 లక్షల నుంచి ఫిబ్రవరి 23 నాటికి 6.96 లక్షలకు (258 శాతం) పెరిగింది. నెలాఖరుకు ఈ సంఖ్య ఏడు లక్షలను దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం బాగా పెరుగుతుండటం, కూలీల కొరత ఉండటంతో ట్రాక్టర్లను కొనుక్కునే రైతుల సంఖ్య పెరుగుతోంది. పల్లెప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి ఓ ట్రాక్టర్‌ ఇవ్వడమూ ఓ కారణం. నదులు, ఉప నదుల్లోని ఇసుక ఆదాయ వనరుగా మారడంతో సమీప గ్రామాల్లో ట్రాక్టర్ల సంఖ్య భారీగా పెరగడమూ మరో ముఖ్య కారణంగా కనిపిస్తోంది.


‘లైఫ్‌’తోనే అధిక ఆదాయం

రవాణాశాఖ ఆదాయంలో లైఫ్‌ ట్యాక్స్‌, త్రైమాసిక పన్ను, యూజర్‌ ఛార్జీలు ప్రధాన ఆదాయ వనరులు. దాదాపు నాలుగింట మూడొంతుల ఆదాయం వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో వసూలు చేసే లైఫ్‌ ట్యాక్స్‌తోనే వస్తోంది.


ఎలక్ట్రిక్‌ వాహనాలు 0.37 శాతమే

డీజిల్‌, పెట్రోలు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ ఆ ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోళ్ల దూకుడు తగ్గడం లేదు. కాలుష్యాన్ని, అంతకుమించి ఇంధన ఖర్చుల్ని భారీగా తగ్గించే ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు రాష్ట్రంలో ఇంకా ఊపందుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ వాహనాల సంఖ్య 60 వేల లోపే ఉంది. మొత్తం వాహనాల్లో ఇవి 0.37 శాతమే.


రవాణా రాబడి రయ్‌..రయ్‌

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ఆర్జించిన ఆదాయం రూ.రెండు వేల కోట్లలోపే. 2022-23 నాటికి ఇది మూడింతలు దాటింది. ఈ ఏడాది ఆదాయం రూ.ఆరు వేల కోట్ల పైచిలుకే. 2020-21లో కొవిడ్‌తో ఆదాయం తగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని