ఆర్టీసీలో కొలువుల భర్తీకి బ్రేక్‌డౌన్!
ఆర్టీసీలో ఉద్యోగులు భారీగా తగ్గిపోతున్నారు. చివరిసారిగా ఉమ్మడి ఆర్టీసీలో 2013లో ఉద్యోగాల భర్తీ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్‌ఆర్టీసీ ఏర్పడింది.
పదేళ్లుగా లేని నియామకాలు
ఏడేళ్లలో 11,765 మంది తగ్గిన ఉద్యోగులు
ఆర్టీసీలో ఉద్యోగులు భారీగా తగ్గిపోతున్నారు. చివరిసారిగా ఉమ్మడి ఆర్టీసీలో 2013లో ఉద్యోగాల భర్తీ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్‌ఆర్టీసీ ఏర్పడింది. 2015-16లో 55,993 మంది ఉద్యోగులుండగా, 2022 డిసెంబరు నాటికి ఆ సంఖ్య 44,228కి తగ్గింది. ఆర్టీసీ యాజమాన్యం మాత్రం దశాబ్దకాలంగా కొత్త ఉద్యోగాల భర్తీ జోలికి వెళ్లట్లేదు. 2011-12లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసునే ఆ తర్వాత సంవత్సరాల్లో దశల వారీగా సంస్థ క్రమబద్ధీకరించింది. రానున్న అయిదేళ్ల(2023-2027)లో 10,307 మంది ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ల సంఖ్య 3484. కండక్టర్లు 3245. మిగిలిన వారు గ్యారేజి, భద్రతాసిబ్బంది, సూపర్‌వైజర్లు, అధికారులు ఉన్నారు. మొత్తంగా చూస్తే 2023లో 2325, 2024లో 2196, 2025లో 1859, 2026లో 2000, 2027లో 1927 మంది రిటైరవ్వనున్నట్లు సమాచారం. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచడంతో 2020, 2021లలో ఉద్యోగుల పదవీ విరమణల్లేవు.
ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు
కొత్తగా నియామకాలు లేకపోవడంతో మిగిలినవారిపై పనిభారం పెరుగుతోందని పలువురు కార్మికులు వాపోతున్నారు. డబుల్‌డ్యూటీలు, అదనపు పనిగంటలు చేయాల్సి వస్తోందంటున్నారు.
గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశపెడితే 620 మంది కార్మికులు వీఆర్‌ఎస్ తీసుకున్నారు. సగటున ఏటా 250 మంది కార్మికులు అనారోగ్య కారణాలతో చనిపోతున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
పోస్టులు లేక డ్రైవర్ల ఆందోళన
ఇంధన వ్యయం తగ్గించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యమిస్తోంది. వీటిని కొనుగోలు చేయకుండా ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుని కిలోమీటర్ల వారీగా డబ్బు చెల్లిస్తోంది. ఈ బస్సుల్లో డ్రైవర్లు ఆ సంస్థకు చెందినవారే ఉంటారు. ఇటీవల 3 వేలకు పైగా ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకునేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించింది. దీంతో తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు 2015-16లో 10446 బస్సులుంటే.. 2022 డిసెంబరు నాటికి ఆ సంఖ్య 9092కు తగ్గింది.
ప్రభుత్వామోదం కోసం ఎదురుచూపులు!
సంస్థలో ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీఎస్‌ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. డ్రైవర్లు, సూపర్‌వైజర్ల నియామకం కోసం అడిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రానున్న నెలల్లో చాలామంది రిటైరవుతున్నారు. సంస్థ ఇటీవల 116 మందిని కానిస్టేబుళ్లుగా నియమించింది. అయితే ఇవి కారుణ్య నియామకాలు కావడం గమనార్హం.
ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి
-
World News
పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు
-
India News
క్రికెట్ బుకీని ఫోన్‌కాల్స్‌తో పట్టించిన అమృతా ఫడణవీస్