భావి ఆవిష్కర్తలూ.. ఆలోచనలు పంపండి

సమాజహిత ఆవిష్కరణలు వీలైనన్ని ఎక్కువగా రావాలనే లక్ష్యంతో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌ ‘ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఫెయిర్‌’కి శ్రీకారం చుట్టింది.

Updated : 27 Mar 2023 06:25 IST

ఐఐటీహెచ్‌ పిలుపు
8-10 తరగతుల విద్యార్థులకు ‘ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఫెయిర్‌’

ఈనాడు, సంగారెడ్డి: సమాజహిత ఆవిష్కరణలు వీలైనన్ని ఎక్కువగా రావాలనే లక్ష్యంతో భాగంగా ఐఐటీ హైదరాబాద్‌ ‘ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఫెయిర్‌’కి శ్రీకారం చుట్టింది. 8 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం దీనిని నిర్వహిస్తున్నారు. గరిష్ఠంగా అయిదుగురు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి తమ ఆలోచనలను పంపించవచ్చు. ఒక్కో పాఠశాల నుంచి రెండు బృందాలకు అవకాశం ఉంటుంది. తమ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను 500 పదాలకు మించకుండా రాసి మెయిల్‌ చేయాలి. ఇదే అంశంపై మూడు నిమిషాల నిడివి గల వీడియోను సమర్పించాలి. వీటిని ఈ నెల 31లోగా younginventors@iith.ac.inకి పంపాలని నిర్వాహకులు సూచించారు. వచ్చిన ఆలోచనల్లో మేలైన వాటిని ఎంపిక చేసి.. ఏప్రిల్‌ 13న ఐఐటీ ప్రాంగణంలో ప్రదర్శిస్తారు. ఏప్రిల్‌ 14న ఐఐటీ హైదరాబాద్‌ 15వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అత్యుత్తమ ఆలోచనలు పంపినవారికి ఆయన చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో వారి ఆలోచనలు ఆవిష్కరణలుగా మారేలా చేయూత అందిస్తామని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌ మూర్తి తెలిపారు. ‘ఫ్యూచర్‌ ఇన్నోవేషన్‌ ఫెయిర్‌’ను ఏటా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. మరోవైపు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఐఐటీ ప్రాంగణంలో ఇప్పటికే టెక్నాలజీ ఇన్నోవేషన్‌ పార్క్‌ భవనాన్ని అందుబాటులోకి తెచ్చామని.. ఆవిష్కర్తలు తమ పరిశోధనలను సాగించేందుకు ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తామని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు