రాబడి ఘనం.. భద్రత శూన్యం

ప్రభుత్వానికి ఏటా రూ.2 వేల కోట్ల రాబడిని తెచ్చిపెట్టే మండల రెవెన్యూ కార్యాలయాల్లో భద్రత, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది.

Published : 27 Mar 2023 05:02 IST

తహసీల్దారు కార్యాలయాల్లో పనిచేయని సీసీ కెమెరాలు
కార్యాలయాల నిర్వహణకు నిధుల కొరత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వానికి ఏటా రూ.2 వేల కోట్ల రాబడిని తెచ్చిపెట్టే మండల రెవెన్యూ కార్యాలయాల్లో భద్రత, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. పాలనలో కీలకమైన తహసీల్దారు- సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయని దుస్థితి. కార్యాలయ నిర్వహణకు కేటాయిస్తున్న బడ్జెట్‌ కూడా అంతంతమాత్రంగా మారింది. దీంతో వివిధ రకాల సేవలకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు వసతులుండటం లేదు. భూముల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు దాదాపు 36 రకాల సేవలు అందించే కార్యాలయాలను చిన్నచూపు చూస్తున్నారంటూ రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

నిధులు ఏవీ...

రాష్ట్రంలో ఉన్న 584 సంయుక్త సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రెండేళ్ల కిందట పదేసి లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ధరణి కార్యాలయం, కంప్యూటర్లు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని సూచించినా.. చాలా జిల్లాల్లో అమలు కాలేదు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి తహసీల్దారు కార్యాలయాలకు సగం డబ్బులే మంజూరయ్యాయి. దీంతో శిథిల భవనాల్లోనే నడిపిస్తున్నారు. 2019లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి హత్య అనంతరం ప్రభుత్వం ప్రతి తహసీల్దారు కార్యాలయంలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరుచేసింది. దీంతో అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అవి కొన్నిచోట్ల పనిచేయడంలేదు. కార్యాలయ నిర్వహణకు ఏడాదికి కనిష్ఠంగా రూ.40 వేలు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. వాస్తవ ఖర్చు రూ.లక్ష వరకు ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. నెలకు రూ.25 వేలు నిర్వహణ కింద కేటాయిస్తే తప్ప కార్యాలయాల నిర్వహణ కష్టమని ట్రెసా రాష్ట్రాధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి తెలిపారు. నిర్వహణ బడ్జెట్‌ కేటాయింపుపై గతంలోనే ప్రభుత్వానికి నివేదించామని ‘ఈనాడు’కు తెలిపారు.

వివాదాలు ఎందుకంటే...

మండల స్థాయిలో వివిధరకాల భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. ధరణి రిజిస్ట్రేషన్ల సందర్భంగా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రక్రియను నిలిపివేస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కొన్ని తహసీల్దారు కార్యాలయాల వద్ద ఒక్కోసారి ఘర్షణలు నెలకొన్న పరిస్థితులు ఉంటున్నాయి. మీసేవా కేంద్రంలో స్లాటు నమోదైతే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను నిలిపివేసే అధికారం ఎవరికీ లేకుండా ధరణి చట్టాన్ని రూపొందించారు. తెలిసీ తప్పు జరుగుతుంటే మాత్రమే ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రక్రియను ఆపుతున్నారు. ఈ సందర్భంగా భూ యజమానులు వాగ్వాదానికి దిగుతున్నారు.


బ్యాంకులో పాసుపుస్తకం తాకట్టు ఉందంటూ భూమి రిజిస్ట్రేషన్‌ నిలిపివేసినందుకు వరంగల్‌ జిల్లా నల్లబెల్లి తహసీల్దారు- సంయుక్త సబ్‌రిజిస్ట్రారుపై ఇటీవల పెట్రోలు పోసి తగలబెడతామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన తాలూకు దృశ్యాలను రికార్డు చేయాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడమే లేదు. ధరణి సేవలను అందించేందుకు ప్రభుత్వం కేటాయించిన రూ.10 లక్షలు ఇప్పటికీ మంజూరు కాలేదు. ఈ భవనంలో వర్షం కురుస్తుండగా.. గోడలు పగుళ్లు వచ్చాయి. సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. రాష్ట్రంలో దాదాపు రెండొందల కార్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు