అయిదేళ్లుగా బదిలీల్లేవ్‌

రాష్ట్ర ఖజానాకు అధిక ఆదాయం సముపార్జించి పెట్టే వాణిజ్య పన్నులశాఖలో కీలక పోస్టుల్లో అధికారులు, ఉద్యోగులు అయిదారేళ్లుగా పాతుకుపోయారు.

Published : 27 Mar 2023 03:18 IST

కీలక స్థానాల్లో పాతుకుపోయిన అధికారులు, ఉద్యోగులు
పదోన్నతులొచ్చినా కిందిస్థాయి పోస్టుల్లోనే పలువురు..
వాణిజ్య పన్నులశాఖలో పరిస్థితి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు అధిక ఆదాయం సముపార్జించి పెట్టే వాణిజ్య పన్నులశాఖలో కీలక పోస్టుల్లో అధికారులు, ఉద్యోగులు అయిదారేళ్లుగా పాతుకుపోయారు. సాధారణంగా ప్రభుత్వానికి నిత్యం ఆదాయం సమకూర్చే వాణిజ్య పన్నులు వంటి శాఖల్లో కీలక స్థానాల్లోని అధికారులను 2 లేదా 3 ఏళ్లకు మించి ఉంచకుండా బదిలీ చేయడం ఆనవాయితీ. కానీ, ఈ శాఖలో 2018 నుంచీ బదిలీలు లేకపోవడంతో కొందరు సుదీర్ఘ కాలంగా ఒకేచోట ఉండిపోయారు. 2018లో బదిలీలు చేపట్టినప్పుడు కనీసం రెండేళ్లపాటు పనిచేసినవారికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆ తర్వాత మళ్లీ బదిలీలు చేపట్టలేదు. మరోవైపు, రెండేళ్ల క్రితం పదోన్నతి పొందిన 185 మంది అధికారులకు ఇంతవరకూ వేరే స్థానాల్లో పోస్టింగులు ఇవ్వకుండా పాత పోస్టుల్లోనే కొనసాగిస్తున్నారు. దీని వల్ల ఉన్నతస్థాయి పోస్టుకు ప్రమోషన్‌ వచ్చినా అంతకన్నా తక్కువ స్థాయి స్థానంలో పనిచేయాల్సి వస్తోందని ఓ అధికారి ‘ఈనాడు’తో వాపోయారు. కొన్ని ప్రధాన పట్టణాల్లో ‘సంయుక్త వాణిజ్య పన్నుల కమిషనర్‌’(జేసీటీవో) పోస్టుల్లో పాత అధికారులే అయిదేళ్లకు పైగా పనిచేస్తున్నారు. కాగా, రెండేళ్ల క్రితం కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారిని తొలుత శిక్షణ నిమిత్తం తాత్కాలికంగా నియమించారు. వారు ఇప్పటికీ అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. శాశ్వత స్థానాల్లో పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరవాత ప్రతి సర్కిల్‌ కార్యాలయం పరిధిలో 2 వేలకు తగ్గకుండా పన్ను చెల్లింపుదారులు ఉండేలా శాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. సర్కిల్‌ కార్యాలయాల సంఖ్యను 91 నుంచి 118కి, డివిజన్‌లను 12 నుంచి 14కు ప్రభుత్వం పెంచింది. కొత్తగా 161 పోస్టులను సైతం మంజూరు చేసింది. శాఖలో మొత్తం 3 వేలకు పైగా ఉద్యోగాలుండగా.. 400 దాకా ఖాళీలున్నాయి. పదోన్నతులు పొందినవారిని కొత్త సర్కిళ్లు, డివిజన్లలో నియమించి రాబడి పెంచేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని