వ్యక్తిగత డేటా ఎవరెవరికి చేరింది?

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మరింత లోతుగా శోధిస్తోంది.

Published : 27 Mar 2023 03:18 IST

సమాచార చౌర్యం కేసులో సిట్‌ ఆరా

ఈనాడు- హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తిగత డేటా చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మరింత లోతుగా శోధిస్తోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు సమాచారాన్ని ఎవరెవరికి అమ్మారనే అంశంపై దృష్టి సారించారు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. నాగ్‌పుర్‌కు చెందిన నిందితుడు జియా ఉర్‌ రెహ్మాన్‌ నుంచి మిగిలిన ఆరుగురూ సమాచారం కొన్నారు. డేటా మార్ట్‌ ఇన్ఫోటెక్‌, గ్లోబల్‌ డేటా ఆర్ట్స్‌, ఎంఎస్‌ డిజిటల్‌ గ్రోవ్‌ పేరిట మూడు సంస్థల్ని ఏర్పాటుచేసి విక్రయిస్తున్నారు. దీంతో కాల్‌డేటా, మెయిళ్లు, ఇతర మార్గాల్లో డేటా కొన్న వ్యక్తులపైనా దృష్టిపెట్టారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 12 ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, 2 సీపీయూలను సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైబర్‌ సేఫ్టీ(టీఎస్‌పీసీసీ) ద్వారా విశ్లేషిస్తున్నారు. స్థానికంగా ఉన్న మరికొన్ని కాల్‌సెంటర్లు, డేటా సర్వీస్‌ ప్రొవైడర్ల సంస్థలపైనా పోలీసులు దృష్టి పెట్టారు.

పోలీసు కస్టడీకి నిందితులు

నిందితుల్ని సిట్‌ ఆధ్వర్యంలో కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. కస్టడీ కోసం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై ఇతర రాష్ట్రాల పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు చెప్పారు. నిందితులు దిల్లీ సమీపంలోని నోయిడాలో కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. గతేడాదిగా ఈ దందా నడుస్తున్నా అక్కడి పోలీసులు గుర్తించలేకపోయారు. తాజాగా వెలుగులోకి రావడంతో దిల్లీ పోలీసులు సైబరాబాద్‌ అధికారులతో మాట్లాడారు. భారత్‌లో జరిగే సైబర్‌ మోసాల్లో చైనా మూలాలు ఉంటున్నాయి. ఫోన్‌ నంబర్లు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటా చైనాలోని సైబర్‌ నేరగాళ్లకు చేరిందా అనే కోణంలోనూ అనుమానిస్తున్నారు. నిందితుల బ్యాంకు లావాదేవీలను అధికారులు గమనిస్తున్నారు. లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలు వినియోగిస్తే వారికి నోటీసులిచ్చి విచారించనున్నారు. నిందితుల్లో ఒకరైన కుమార్‌ నితీశ్‌ భూషణ్‌ ఇప్పటికే నోయిడాలో ఇల్లు, కొంత బంగారం కొన్నాడు. ఇదేకోణంలో మిగిలిన వారు ఏం చేశారన్న అంశంపైనా అధికారులు దృష్టి పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని