దస్త్రాలు దాటని ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణ నిధులు

హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ అయోమయంలో పడింది.

Published : 27 Mar 2023 03:18 IST

ఈ బడ్జెట్‌లో కేటాయించినా విడుదల కాని వైనం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం భూసేకరణ అయోమయంలో పడింది. రాష్ట్రప్రభుత్వం తనవాటా నిధులను విడుదల చేయడం లేదు. మరో అయిదు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. మొత్తం 344 కిలోమీటర్ల ప్రాంతీయ రింగురోడ్డు మార్గాన్ని రెండు భాగాలుగా నిర్మించనున్న విషయం తెలిసిందే. ఉత్తర భాగాన 158.645 కిలోమీటర్ల మేర నిర్మించాలి. భూసేకరణ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలి. ఈ భాగంలో 4,760 ఎకరాల భూమిని సేకరించేందుకు సుమారు రూ.2,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇందులో రూ.1,100 కోట్ల వరకు రాష్ట్రప్రభుత్వం చెల్లించాలి. భూసేకరణకు కనీసం రూ.500 కోట్లయినా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ లేఖలు రాస్తోంది. రాష్ట్రం నుంచి స్పందన లేదని తెలుస్తోంది. ఉత్తర భాగం మార్గానికి తన వాటాగా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో, వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్ల చొప్పున కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. దీనికి సంబంధించి గత నెలలోనే ఆర్థికశాఖ దస్త్రాన్ని ప్రభుత్వామోదం కోసం సిద్ధం చేసింది. అది ముందుకు కదలలేదని సమాచారం. భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తే ఆర్నెల్లలో ముగించేందుకు జాతీయ రహదారుల సంస్థ ప్రణాళిక రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా భూసేకరణ తుది నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు కేంద్రం సుముఖంగా లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని