విద్యుత్కేంద్రాల బూడిదతో తంటాలు

దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి నిత్యం వెలువడుతున్న కోట్లాది టన్నుల బూడిదను వదిలించుకోవడం అతిపెద్ద సమస్యగా మారింది.

Published : 27 Mar 2023 04:56 IST

ఎవరూ తీసుకోకపోతే.. ఉచితంగా రవాణా చేయాలి
థర్మల్‌ కేంద్రాలకు కేంద్ర విద్యుత్తుశాఖ ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి నిత్యం వెలువడుతున్న కోట్లాది టన్నుల బూడిదను వదిలించుకోవడం అతిపెద్ద సమస్యగా మారింది.దీనిపై అధ్యయనం చేసిన కేంద్ర విద్యుత్‌శాఖ బూడిదను వదిలించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను సూచిస్తూ అన్ని రాష్ట్రాల జెన్‌కోలకు తాజాగా మార్గ్గదర్శకాలు జారీచేసింది. దీని ప్రకారం... బూడిదను విక్రయించేందుకు తొలుత బహిరంగ ప్రకటన జారీచేసి టెండర్లు పిలవాలి. ఒక టన్నుకు ఎవరు ఎక్కువ ధర చెల్లించడానికి టెండరు వేస్తే వారికే బూడిద ఇవ్వాలి. టెండరులో ఎవరూ కొనడానికి ముందుకురాకపోతే వారికి ఉచితంగా ఇస్తాం... రవాణా ఖర్చులు భరించి తీసుకెళ్లమని చెప్పాలి. అయినా ఎవరూ ముందుకు రాకపోతే ప్రతీ థర్మల్‌ కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణ పనులు చేసే సంస్థలకు, గనులకు నోటీసులిచ్చి బూడిద తీసుకెళ్లాలని, అవసరమైతే ఉచితంగా రవాణా చేస్తామని  తెలపాలి. ఈ మేరకు సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణానికి కొత్తగూడెం థర్మల్‌ కేంద్రం నుంచి బూడిదను ఉచితంగా ఇస్తామని యాజమాన్యం జెన్‌కోకు తెలిపింది. రహదారి నిర్మాణం జరిగే ప్రాంతం వరకూ ఉచితంగా తీసుకురావాలని రహదారి నిర్మాణ సంస్థ కోరింది. రవాణా ఛార్జీలు భరించడం వల్ల ఈ కేంద్రాల నిర్వహణ వ్యయం బాగా పెరుగుతుందని, అక్కడ ఉత్పత్తి చేసే కరెంటు యూనిట్‌ ధరలు పెంచి డిస్కంలకు అమ్మాల్సి ఉంటుందని, దీనివల్ల వినియోగదారుడిపై కూడా భారం పడుతుందని పలు థర్మల్‌ కేంద్రాలు కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. ఎవరైనా ఉచితంగా తీసుకోవడానికి ముందుకొచ్చినా  థర్మల్‌ కేంద్రం ఇవ్వకపోతే దాని యాజమాన్యంపై ఫిర్యాదు చేయాలని ప్రజలకు కేంద్ర విద్యుత్తుశాఖ సూచించింది. బూడిదను ఎట్టి పరిస్థితుల్లోనూ థర్మల్‌ కేంద్రం ఆవరణలో ఉంచవద్దని... ఎప్పటికప్పుడు తరలించే ఏర్పాట్లు చేయాలని పేర్కొంది.

రోజూ 18 వేల టన్నుల బూడిద..

తెలంగాణలో రామగుండం, పాల్వంచ, భూపాలపల్లిల్లోని థర్మల్‌ కేంద్రాల్లో రోజూ సగటున 50 వేల టన్నుల బొగ్గును మండించడం వల్ల 18 వేల టన్నుల బూడిద వెలువడుతోంది. దీన్ని వదిలించుకోవడానికి జెన్‌కో టెండర్లు పిలుస్తోంది. భూపాల్‌పల్లిలో 100 శాతం బూడిదను కొన్ని సిమెంటు, నిర్మాణ కంపెనీలు కొంటున్నాయి. కొత్తగూడెంలో 65 శాతమే కొంటున్నందున మిగిలిన దాన్ని చుట్టుపక్కల ఇటుక తయారీదారులకు టన్ను బూడిదను జెన్‌కో రూపాయికే విక్రయిస్తోంది. మణుగూరులోని భద్రాద్రి విద్యుత్కేంద్రం నుంచి ఉచితంగా ఇస్తామన్నా ఎవరూ కొనకపోవడం వల్ల మిగిలిపోతోంది. దాన్ని వదిలించుకోవడానికి మళ్లీ టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని