అన్నదాతకు ‘అకాల’ కష్టం

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా ఏటా యాసంగి సీజన్‌లో అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని రైతులను గట్టెక్కించే ముందస్తు సన్నద్ధత అంతగా కనిపించడం లేదు.

Updated : 28 Mar 2023 05:41 IST

ఏటా యాసంగిలో వర్షాలు  
ముందస్తు సన్నద్ధత ఏదీ!  
సాయంపైనా తకరారు
ఈనాడు - హైదరాబాద్‌

కటి కాదు.. రెండు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా ఏటా యాసంగి సీజన్‌లో అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని రైతులను గట్టెక్కించే ముందస్తు సన్నద్ధత అంతగా కనిపించడం లేదు. మరోవైపు పంట నష్టాలకు సాయంపై తకరారు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.

రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో సంభవిస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఈ సీజన్‌ అంటేనే పలువురు రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. 2015 నుంచి ఈ ఏడాది వరకు ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. కొన్నిసార్లు వడగళ్లు కూడా పడటంతో రైతులు మరింతగా నష్టపోయారు.  గత వారం భారీ వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులతో 22 జిల్లాల్లోని దాదాపు 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. ఈ నష్టాలు ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి.
సాధారణంగా సీజన్ల వారీగా కొన్ని అంచనాలతో రైతులు పంట పండిస్తున్నారు. యాసంగిలో వర్షాల భయం ఉండదనే నమ్మకం వారిలో ఉంటుంది. ఈ తరుణంలో వర్షాలు, వడగళ్లు వారి ఆశలకు గండి కొడుతున్నాయి. ప్రధానంగా వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. మామిడి వంటివి కోత దశలో నేలపాలవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలాఖరు వరకు రైతులు పంటలను కాపాడుకుంటేనే అవి చేతికి దక్కుతాయి. అకాల వర్షాల భయం వీడక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ నిధుల నుంచి సాయం అందించాలి. అకాల వర్షాల విషయంలో సాయం సరిగా అందడం లేదు. రాష్ట్రంలో బీమా పథకం అమల్లో లేదు. పరిహారం అందడం లేదు. అకాల వర్షాలు కొద్దిరోజులే ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించినా పంటనష్టం అంచనా బృందాలు సకాలంలో రావడం లేదు. ఆ తర్వాత వచ్చినా పంట నష్టాలను స్వయంగా చూసేది ఉండదు. ఛాయాచిత్ర ప్రదర్శనలను చూసి వెళ్తున్నాయి. సాయానికి సంబంధించి శాస్త్రీయ అంచనాలు, గణాంకాలు నమోదు కావడం లేదు. దీనిని కారణంగా చూపుతూ నష్టాలకు పరిహారం ఇవ్వడం లేదు. గత ఏడాది భారీ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వగా.. కేంద్రం నుంచి సాయం రాలేదు. దీంతో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను ఎకరానికి రూ.10 వేలు చెల్లిస్తామని ప్రకటించింది.

ఏటా అకాల వర్షాలు పడుతున్నా రైతులు ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం చేయడం లేదు. సీజన్‌కు ముందు వారిలో చైతన్యం కలిగించడంతో పాటు.. అకాల వర్షాలను తట్టుకొని నిలిచే పంటల సాగును ప్రోత్సహించడం వంటి చర్యలు కనిపించడం లేదు. కేవలం వర్షాలకు ఒకటి, రెండు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. అప్పటికప్పుడు పంట నష్టాలను నివారించే మార్గం అన్నదాతలకు కనిపించడం లేదు.


నెల రోజుల ముందుకు సీజన్‌!

రాష్ట్రంలో ఏటా అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం కలుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. యాసంగి సీజన్‌ను నెల రోజులు ముందుకు జరపాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈమేరకు వచ్చే యాసంగిని అక్టోబరు నుంచి ప్రారంభించి ఫిబ్రవరి లేదా మార్చిలో ముగించాలని యోచిస్తోంది. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో ఈ విధానం నడుస్తోంది. తద్వారా ఆ పంటలకు అకాల వర్షాల ముప్పు తగ్గుతోంది. తాజాగా పంట నష్టాల పరిశీలన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ ప్రతిపాదనను తెరమీదకి తెచ్చారు.


వరుసగా నష్టాలు..

చిదురాల చక్రపాణి, రైతు, మహేశ్వరం, వరంగల్‌ జిల్లా

రెండు ఎకరాల్లో మునగ చెట్లను వేశాను. కాతకొచ్చే దశలో గత ఏడాది వడగళ్లతో మొత్తం పంటపోయి రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది అదే భూమిలో మొక్కజొన్న వేశాను. కంకి తయారయ్యే దశలో ఇటీవల వడగళ్లు పడటంతో ఈసారి మళ్లీ రూ.2 లక్షల నష్టం వాటిల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు