ఎసిడిటీ ఔషధాల్లో నకిలీలు.. పాంటాప్రజోల్‌ జనరిక్‌లో గుర్తింపు

ఇటీవల వరంగల్‌ నగరంలో ఔషధ నియంత్రణాధికారులు జరిపిన దాడుల్లో రెండు బ్యాచ్‌ల ఎసిడిటీ మందుల్లో నకిలీలను గుర్తించారు.

Updated : 28 Mar 2023 06:47 IST

వరంగల్‌లో చేసిన తనిఖీల్లో బహిర్గతం
ప్రముఖ కంపెనీకి చెందిన రెండు బ్యాచ్‌ల మందులపై నిషేధం
యూపీలో ఉత్పత్తి అయినట్లు నిర్ధారణ

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల వరంగల్‌ నగరంలో ఔషధ నియంత్రణాధికారులు జరిపిన దాడుల్లో రెండు బ్యాచ్‌ల ఎసిడిటీ మందుల్లో నకిలీలను గుర్తించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉత్పత్తి అయిన ఈ మందుల్లో పిండిముద్ద తప్ప ఔషధ గుణం ఇసుమంతైనా లేదని పరీక్షల్లో తేలింది. ఈ రెండూ ఒకే ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందినవే కావడం గమనార్హం. మార్కెట్‌లో చలామణి అయ్యే మొత్తం ఎసిడిటీ మందుల్లో... ఈ కంపెనీకి చెందినవే సుమారు 50% ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రముఖ కంపెనీవి కావడంతో వైద్యులు వీటినే ఎక్కువగా రాస్తుంటారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులూ వీటినే అధికంగా వాడుతుంటారు. అంత పేరున్న కంపెనీ నుంచి నకిలీ మందులు ఉత్పత్తి అవడం ఆందోళన కలిగించే అంశమేనని ఔషధ నియంత్రణాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన ఆ రెండు బ్యాచ్‌ల ఎసిడిటీ మందులను స్వాధీనం చేసుకుని, నిషేధం విధించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఈ బ్యాచ్‌ల మందులు చలామణిపై వెంటనే పరిశీలించాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశించారు.

వాట్సప్‌ సమాచారంతో అప్రమత్తం

15 రోజుల కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ఔషధాల్లో నకిలీవి గుర్తించినట్లుగా రాష్ట్ర ఔషధ నియంత్రణాధికారులకు వాట్సప్‌ సమాచారం అందింది. దాంతో క్షేత్రస్థాయిలో లోతుగా పరిశీలించాలని డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలిచ్చారు. తనిఖీల్లో భాగంగా వరంగల్‌లోని ఒక మెడికల్‌ షాపులో ‘పాంటాప్రజోల్‌’ జనరిక్‌ పేరుతో ఉండే ఓ ప్రముఖ ఔషధ కంపెనీకి చెందిన రెండు బ్యాచ్‌లకు చెందిన రెండు మందుల్లో నాణ్యత లోపించినట్లుగా గుర్తించారు. నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల్లో వాటిలో అసలు ఔషధ గుణమే లేదని తేలింది. దీంతో రెండు బ్యాచ్‌ల మందులను స్వాధీనం చేసుకుని, మార్కెట్లో వాటి అమ్మకాలను నిలిపివేశారు. నిషేధిత మందులను కోర్టులో డిపాజిట్‌ చేశారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. వరంగల్‌కు చెందిన ఔషధ దుకాణదారు బెంగళూరు నుంచి వాటిని కొనుగోలు చేసినట్లుగా తేలింది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు అక్కడికి కూడా వెళ్లి పరిశీలించారు. వాళ్లు ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి కొన్నట్లు వెల్లడైంది. ఔషధాల ఉత్పత్తి కూడా ఉత్తరప్రదేశ్‌లోనే జరిగింది. వారం రోజుల్లో కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌ వచ్చి వివరణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ రాయితీతో బోల్తా

ఏ రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన మందులైనా దేశవ్యాప్తంగా విక్రయించడానికి అనుమతులు ఉండడంతో వాటి నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. ఫలితంగా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే నకిలీ మందులు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. తయారీదారులు ఇచ్చే భారీ రాయితీల ఆకర్షణలోపడి కొందరు అమ్మకందారులు వాటిని రోగులకు అంటగట్టుతున్నారు. వరంగల్‌లోనూ అదే జరిగింది. మందుల దుకాణదారు ఆన్‌లైన్‌లో ఎవరు ఎక్కువ డిస్కౌంట్‌ ఇస్తున్నారనే విషయాన్ని విచారించి... భారీగా రాయితీ ఇచ్చిన డీలర్‌కు ఆర్డర్‌ ఇచ్చినట్లుగా అధికారుల విచారణలో వెల్లడైంది.

నియంత్రణ వ్యవస్థ లోపభూయిష్టం

కంపెనీల్లో ఔషధాల ఉత్పత్తి క్రమంలో ప్రతి దశలోనూ నమూనాల సేకరణ, పరీక్ష వంటివి నిరంతరం జరుగుతాయి. కొన్ని ప్రముఖ సంస్థలు ఈ బాధ్యతలను పొరుగు సేవల సంస్థలకు అప్పగిస్తున్నాయి. అంటే మందుపై ప్రముఖ కంపెనీ పేరే ముద్రితమై ఉంటుంది. కానీ దాన్ని తయారు చేసేది మరో సంస్థ! ఈ క్రమంలో నాణ్యతకు నీళ్లొదులుతున్న తీరు ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడే బహిర్గతం అవుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఔషధ నియంత్రణ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనీ, అందుకే ఆయా రాష్ట్రాల నుంచి నాసిరకమైన మందులు విపణిలోకి వస్తున్నాయని ఔషధ నియంత్రణాధికారులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని