ఇక పంచాయతీల ఖాతాల్లోకి నేరుగా నిధులు

ఏప్రిల్‌ 1 నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు జమ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

Published : 28 Mar 2023 04:24 IST

రైతుల గురించి మాట్లాడే హక్కు భాజపా నేతలకు లేదు
సంగారెడ్డి జిల్లా పర్యటనలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, సంగారెడ్డి: ఏప్రిల్‌ 1 నుంచి నేరుగా పంచాయతీల ఖాతాల్లోకే నిధులు జమ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం; పల్లె, పట్టణ ప్రగతికి సంబంధించిన నిధులు గ్రామ, మండల, జిల్లా పరిషత్తులకు చెందిన ఖాతాలకే వస్తాయన్నారు. దీనివల్ల ఎలాంటి జాప్యం లేకుండా అభివృద్ధి పనులు చేసుకోవడానికి వీలవుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో సోమవారం ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తమ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం చెల్లించేలా నిర్ణయం తీసుకుందన్నారు. ఎకరాకు రూ.10 వేలు చొప్పున అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారన్నారు. ఆ మొత్తం సరిపోదని భాజపా నేతలు అంటున్నారని.. వడగళ్ల వానలతో నష్టపోయిన అన్నదాతలపై నిజంగా వారికి ప్రేమ ఉంటే కేంద్రం నుంచి ఎకరాకు రూ.10 వేలు వచ్చేలా చొరవ తీసుకోవాలని సవాల్‌ విసిరారు. భాజపా నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో తాగేందుకు నీళ్లు దొరక్క మహిళలు పొలాల వద్దకు వెళ్లి బిందెలతో మోసుకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో మారుమూల పల్లెల్లోనూ ఇంటింటికీ నల్లా ద్వారా రోజూ మంచినీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇది తెలంగాణ సాధించిన విజయమని అభివర్ణించారు.రూ.15 కోట్లతో 1,200 ఏఈడీ యంత్రాల కొనుగోలు..: అకస్మాత్తుగా కార్డియాక్‌ అరెస్ట్‌ అయినప్పుడు సీపీఆర్‌ ఎలా చేయాలనే విషయమై సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా దేశంలో ఈ సమస్యతో 15 లక్షల మంది చనిపోతున్నారన్నారు. కేవలం 2 శాతం మందికే సీపీఆర్‌ చేయడం తెలుసన్నారు. సకాలంలో సీపీఆర్‌ చేస్తే 50 శాతం మందిని బతికించుకోవడం సాధ్యమవుతుందన్నారు. రానున్న రోజుల్లో 100కు పైగా ఉద్యోగులు పనిచేసే పరిశ్రమల్లో తప్పనిసరిగా సీపీఆర్‌ శిక్షణ ఇచ్చేలా చూస్తామన్నారు. అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు తదితర చోట్ల నిర్మాణానికి ముందే ఏఈడీ (ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలేటర్‌) పరికరాలు ఉంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.15 కోట్లు వెచ్చించి 1,200 ఏఈడీ యంత్రాలను కొంటున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమాల్లో సంగారెడ్డి జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని