సింగరేణికివ్వరు.. వేలంలో కొనేవారు లేరు

రాష్ట్రంలోని కొత్త బొగ్గు గనుల వేలంపై అనిశ్చితి నెలకొంది. ఈమేరకు 4 గనులకు గత నెలతో టెండరు దాఖలు గడువు ముగిసినా ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు.

Updated : 28 Mar 2023 05:32 IST

రాష్ట్రంలోని 4 బొగ్గు గనులపై అనిశ్చితి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొత్త బొగ్గు గనుల వేలంపై అనిశ్చితి నెలకొంది. ఈమేరకు 4 గనులకు గత నెలతో టెండరు దాఖలు గడువు ముగిసినా ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గనికి ఒక ప్రైవేటు కంపెనీ టెండరు దాఖలు చేసినా.. నిబంధనల మేరకు ఒక్క కంపెనీ మాత్రమే వేలంలో పాల్గొంటే ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి సంస్థ వీటిని తీసుకునేందుకు టెండరు వేస్తే కచ్చితంగా దక్కే అవకాశం ఉండేది. అయితే టెండరు ప్రక్రియలో పాల్గొనకూడదని సింగరేణి అంతర్గత నిర్ణయం తీసుకుంది. అటు ప్రైవేటు కంపెనీలు టెండర్లు వేయకపోవడం, ఇటు సింగరేణికి నేరుగా కేంద్ర బొగ్గుశాఖ కేటాయించకపోవడంతో ఈ 4 గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఎప్పటికి ప్రారంభమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. టెండర్లు వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం వల్ల వేలానికి దూరంగా ఉన్నట్లు సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు బొగ్గు ఉత్పత్తి పెంచి సరఫరాకు సింగరేణి నానా తంటాలు పడుతోంది. గతంలో వేలంలో దక్కించుకున్న ఒడిశా రాష్ట్రంలోని నైనీ గనిలో ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభించలేకపోయింది. తెలంగాణలో కొత్త గనులను వేలంలో టెండరు వేసి తీసుకుంటేనే ఇస్తామని కేంద్రం మరోమారు స్పష్టం చేయడంతో 10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎప్పటికి సాధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున బొగ్గు ఉత్పత్తి 6.70 కోట్ల టన్నులకు చేరుతుందని తాజా అంచనా. తెలంగాణలో వేలంలో పెట్టిన 4 గనులను నేరుగా తమకే కేటాయించాలని సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా కేంద్రం స్పందించలేదు. వేలంలో టెండరు వేసి సింగరేణి వీటిని దక్కించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే బొగ్గు ఉత్పత్తిపై రాయిల్టీ రూపంలో ఆదాయం అదనంగా పెరుగుతుందని కేంద్రం సమాధానమిస్తోంది.

29 గనుల వేలానికి అనూహ్య స్పందన

దేశవ్యాప్తంగా 29 గనులను వేలానికి పెట్టగా ప్రైవేటు కంపెనీల నుంచి మంచి స్పందన వచ్చిందని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా ప్రకటించింది. బొగ్గు ఉత్పత్తిపై టన్నుకు కనీసం 4 శాతానికి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తామనే నిబంధనతో వీటిని వేలంలో పెట్టింది. మధ్యప్రదేశ్‌లోని అర్జునీ గనికి ఏకంగా 79.25 శాతం రాయల్టీ చెల్లిస్తామని ఓ ప్రైవేటు కంపెనీ రికార్డుస్థాయిలో కోట్‌ చేస్తూ టెండరు వేసింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని బనాయి భలుముడా గనికి 43 శాతం రాయల్టీ ఇస్తామని మరో కంపెనీ టెండరు దక్కించుకుంది. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కోయగూడెం బ్లాక్‌-3, మంచిర్యాల జిల్లాలోని కల్యాణఖని బ్లాక్‌-6, శ్రావణపల్లి బ్లాక్‌, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్‌-3 గనులను వేలంలో పెట్టింది. ఈ 4 గనులు దక్కితే ఏటా అదనంగా కోటీ 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని సింగరేణి ఇటీవల కేంద్రానికి తెలిపింది. ఈ గనుల్లో బొగ్గు నిల్వలు ఎంతమేర ఉన్నాయనే అన్వేషణకు సింగరేణి గతంలో రూ.66 కోట్లు ఖర్చు చేసింది. సత్తుపల్లి ప్రాంతంలో గనుల నుంచి తవ్వే బొగ్గును తరలించడానికి రైల్వేలైను నిర్మాణానికి రూ.900 కోట్లకు పైగా రైల్వేశాఖకు చెల్లించింది. కొత్త గనులు రాకపోవడంతో ఈమేరకు  వెచ్చించిన నిధులతో పూర్తి ప్రయోజనాలు దక్కడం లేదని సింగరేణి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని