మౌలిక వసతుల కల్పనే కీలకం

రాష్ట్రంలో తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వీలుగా కళాశాలలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.

Updated : 28 Mar 2023 05:28 IST

కొత్త వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది అంశం కొలిక్కి
రెండుసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌ఎంసీ
ప్రత్యేక కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ దృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వీలుగా కళాశాలలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా తొమ్మిది వైద్య కళాశాలను ప్రారంభించడం ద్వారా 900 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్‌, ఖమ్మం, వికారాబాద్‌, భూపాలపల్లి, కామారెడ్డి, జనగాం, సిరిసిల్ల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌లలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలంటే జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) అనుమతించాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు తనిఖీ చేసిన ఎన్‌ఎంసీ బృందాలు బోధన సిబ్బంది నియామకం, వసతులపై అసంతృప్తి వ్యక్తంచేశాయి. మొదటిసారి పరిశీలించినప్పటి పరిస్థితులే తాజాగా వచ్చినప్పుడూ ఉన్నాయని రెండోసారి తనిఖీల సందర్భంగా గుర్తుచేశాయి. దాంతో ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2815 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలు ప్రారంభమైతే మరో 900 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌ఎంసీ మూడోసారి కొత్త వైద్య కళాశాలల తనిఖీకి వచ్చేలోపు బోధనా సిబ్బంది నియామకం, వసతుల కల్పన సహా కీలక అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 24 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా వాటిలో 3,800 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి.

ప్రొఫెసర్లు... అసోసియేట్‌ ప్రొఫెసర్లు ఓకే

తొమ్మిది వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఇందులో భాగంగా 87 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చారు. అలాగే 210 మందికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించే అంశంపైనా దృష్టి సారించారు. 1,442 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియనూ కొలిక్కి తెచ్చారు. అయితే... మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతుండటంతో మంత్రి సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే నీట్‌ ఎంబీబీఎస్‌ ప్రకటన వెలువడింది. అడ్మిషన్ల ప్రక్రియ దశకు రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండటంతో అంతలోపు కొత్త వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని