కృష్ణా బోర్డు ఉద్యోగులకు అలవెన్సు రద్దు చేయండి

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)లో పనిచేసే రాష్ట్ర ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సును రద్దు చేయాలని బోర్డు ఛైర్మన్‌ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

Published : 28 Mar 2023 04:24 IST

రెండు రాష్ట్రాలకు కేఆర్‌ఎంబీ ఆదేశాలు

ఈనాడు హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)లో పనిచేసే రాష్ట్ర ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సును రద్దు చేయాలని బోర్డు ఛైర్మన్‌ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటివరకు చెల్లించిన మొత్తాన్ని వసూలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం మేరకు కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటవగా.. ఇక్కడ పని చేసేందుకు డిప్యూటేషన్‌పై వచ్చే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలని 2021లో బోర్డు నిర్ణయం తీసుకొంది. కృష్ణా బోర్డులో పనిచేసే వారికి మాత్రమే ఈ సదుపాయాన్ని వర్తింపజేసింది. గోదావరి బోర్డులోనూ ఇవ్వాలన్న ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నుంచి కృష్ణా బోర్డుకు వచ్చేవారికి బేసిక్‌లో 25 శాతం ప్రత్యేక అలవెన్సు ఇస్తే ఇతర బోర్డుల్లో పనిచేసే వారి నుంచి కూడా డిమాండ్లు వస్తాయని, ఆ ప్రత్యేక అలవెన్సును ఉపసంహరించుకోవాలని సూచించింది. దీనిపై 2021 జులైలో ఆదేశాలు కూడా జారీ చేశారు. కృష్ణా బోర్డు ఛైర్మన్‌ తాజాగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేశారు.

గోదావరి బోర్డుకు నిధులు ఇవ్వండి

గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు బడ్జెట్‌లో ఆమోదించిన నిధులను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏపీ రూ.10 కోట్లకు గాను రూ.3.84 కోట్లు, తెలంగాణ రూ.10 కోట్లకు రూ.5.27 కోట్లు మంజూరు చేసిందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని