ఎన్‌ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక

వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థులు ఉద్యోగాల సాధనలో సత్తా చాటారు. 2022-23 సంవత్సరం ప్రాంగణ నియామకాల ప్రక్రియ ముగియగా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా కొలువులు దక్కించుకున్నారు.

Updated : 28 Mar 2023 05:23 IST

ఈనాడు, వరంగల్‌: వరంగల్‌ ఎన్‌ఐటీ విద్యార్థులు ఉద్యోగాల సాధనలో సత్తా చాటారు. 2022-23 సంవత్సరం ప్రాంగణ నియామకాల ప్రక్రియ ముగియగా గతంలో ఎన్నడూ లేనంతగా అత్యధికంగా కొలువులు దక్కించుకున్నారు. మొత్తం 1,326 మంది ఉద్యోగాలు సాధించారు. ఈసారి నియామకాలకు 253 కంపెనీలు వరుస కట్టగా అందులో 40 శాతానికిపైగా కొత్తవే ఉన్నాయి. దిల్లీకి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆదిత్య సింగ్‌ అత్యధికంగా రూ.88 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారు. ఒక్కో విద్యార్థికి సగటున రూ.17.29 లక్షల వార్షిక ప్యాకేజీ దక్కింది. 30 మంది విద్యార్థులు రూ.50 లక్షలకుపైగా వార్షిక వేతనాన్ని పొందనున్నారు. 55 మందికి రూ.40 లక్షలకుపైగా, 190 మందికి రూ.30 లక్షలకుపైగా అందుకోనున్నారు. 408 మంది విద్యార్థులకు రూ.20 లక్షలకుపైగా లభించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో 50 మందికిపైగా ఎంపికయ్యారు. 2021-22 విద్యా సంవత్సరంలో 1132 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాలకు ఎంపికయ్యారు. సంస్థలో విద్యా ప్రమాణాలు, పరిశోధనల నాణ్యత పెరగడం వల్లే ఈసారి అత్యధిక మందికి కొలువులు దక్కాయని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్‌.వి.రమణారావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు