సంక్షిప్త వార్తలు(4)

తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ (మహిళ) శిక్షణ కోర్సు పరీక్షకు అభ్యర్థులు ఏప్రిల్‌ 13వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 28 Mar 2023 05:44 IST

ఎంపీహెచ్‌డబ్ల్యూ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ (మహిళ) శిక్షణ కోర్సు పరీక్షకు అభ్యర్థులు ఏప్రిల్‌ 13వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతామహంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌  (ఎంపీహెచ్‌డబ్ల్యూ-మహిళ) పరీక్షలు ఏప్రిల్‌ 24వ తేదీ నుంచి 29 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.


విద్యుత్‌ ఉద్యోగులకు పీఆర్‌సీపై రేపు సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ ఒప్పందంపై బుధవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో యాజమాన్యం సోమవారం తెలిపింది. ఈ మేరకు విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐకాసకు సమాచారం ఇచ్చారు. వేతన సవరణ అమలుకు ఐకాస ఆధ్వర్యంలో ఇటీవల విద్యుత్‌ సౌధలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే.


ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి ఆదర్శం

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ ఉద్యోగుల రిజర్వేషన్‌ అమలులో, పదోన్నతులు, సంక్షేమం తదితర విషయాల్లో ఇతర సంస్థలకు సింగరేణి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సుభాష్‌ పార్థీ ప్రశంసించారు. సోమవారం సింగరేణి భవన్‌లో ఆయన ఎస్సీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, పదోన్నతులు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చాలా పరిశ్రమల్లో నిర్దేశిత ఎస్సీ రిజర్వేషన్‌ 15 శాతం కన్నా తక్కువ అమలవుతోందని.. సింగరేణిలో 17 నుంచి 20 శాతం అమలు కావడం అభినందనీయమని చెప్పారు. అంబేడ్కర్‌ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా అన్ని ఏరియాల్లో ఉత్సవాల నిర్వహణకు రూ.60 వేల చొప్పున మంజూరు చేయడం ప్రశంసనీయమన్నారు. దీన్ని రూ.లక్షకు పెంచాలని ఎస్సీ ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయని.. దీని పట్ల సానుకూలంగా స్పందించాలని సూచించారు. అంతకుముందు సింగరేణిలోని ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.


సీఎస్సార్‌ కింద రూ.2,134 కోట్ల వ్యయం

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్సార్‌) కింద సంస్థలు 2016-17 నుంచి 2020-21 వరకు రూ.2,134.8 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర మంత్రి రావ్‌ ఇంద్రజిత్‌సింగ్‌ తెలిపారు. ఎంపీ రేవంత్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం లోక్‌సభలో సమాధానమిచ్చారు.

గాలి నాణ్యత మెరుగుపరిచే చర్యలకు హైదరాబాద్‌కు 2020-21 నుంచి 2022-23 వరకు రూ.443.5 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

తెలంగాణలో భువనగిరి, ఝరాసంగం, బోధన్‌, మంచిర్యాల, సిద్దిపేట, ఆదిలాబాద్‌, సిరిసిల్ల, మహబూబాబాద్‌లలో కేంద్రీయ విద్యాలయాలు తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. ఎంపీలు మాలోత్‌ కవిత, పసునూరి దయాకర్‌, గడ్డం రంజిత్‌రెడ్డి, బొర్లకుంట వెంకటేష్‌ నేత అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.

విశ్రాంత సైనికోద్యోగుల ఆరోగ్య పథకం(ఈసీహెచ్‌ఎస్‌)లో తెలంగాణ నుంచి 66,650 మంది ఉన్నారని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌ తెలిపారు. ఎంపీ బండి పార్థసారధిరెడ్డి ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.

బేగంపేట విమానాశ్రయంలో 2022లో ఎయిర్‌ నావిగేషన్‌ పరికరాలను మార్చగా, 2021లో కడప విమానాశ్రయంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ (రిటైర్డ్‌) వీకే సింగ్‌ తెలిపారు. వైకాపా ఎంపీ అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని