రైతుల ఖాతాల్లోకే పంట సాయం

అకాల వర్షాలు, వడగండ్లతో నష్టపోయిన పంటలకు.. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు.

Published : 29 Mar 2023 05:17 IST

తక్షణ చర్యలు ప్రారంభించండి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు
అకాల వర్షాలు సహా పలు అంశాలపై సమీక్ష
సీతారాముల కల్యాణానికి రూ.కోటి

ఈనాడు, హైదరాబాద్‌: అకాల వర్షాలు, వడగండ్లతో నష్టపోయిన పంటలకు.. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలన్నారు. కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి.. పంట నష్టం వివరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని తెలిపారు. పంట నష్టం, పోడు భూములు, గొర్రెల పంపిణీ,  ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఆర్థిక సాయం.. తదితర అంశాలపై మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, విపత్తు నిర్వహణ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వడగండ్ల వానలతో పంట నష్టం జరిగిన నేపథ్యంలో.. ఇటీవల సీఎం పర్యటన చేపట్టి రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని అప్పుడు సీఎం ప్రకటించారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఈ నిధులను జమ చేయాలని సమీక్షలో సీఎం స్పష్టంచేశారు. ఈ మేరకు వెంటనే చర్యలు ప్రారంభించాలని సీఎస్‌ శాంతికుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావులను ఆదేశించారు.

గొర్రెల పంపిణీ: ఇప్పటికే ప్రకటించిన విధంగా.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు, పంపిణీ జరుగుతాయన్నారు. ఖాళీ స్థలాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రకటించిన రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని.. ఇందుకు సంబంధించి విధివిధానాలను రూపొందించి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. అర్హులకు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా? అనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. 1.55 లక్షల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు, పాస్‌ పుస్తకాలు ముద్రించి సిద్ధంగా ఉంచామని అధికారులు సీఎంకు తెలిపారు. అర్హులకు పోడు పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.

సీతారాముల కల్యాణ నిర్వహణకు రూ.కోటి

శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 30న భద్రాచలంలో జరగనున్న శ్రీసీతారాముల కల్యాణం నిర్వహణ కోసం సీఎం ప్రత్యేక నిధి నుంచి కోటి రూపాయలను కేసీఆర్‌ మంజూరు చేశారు. కరోనా కారణంగా 2 సంవత్సరాలుగా భద్రాచల దేవస్థానం ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అభ్యర్థన మేరకు సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని