విద్యుత్‌ శాఖలో ఇంటి దొంగలు

ఇంటి దొంగల సహకారంతో యథేచ్ఛగా సాగుతున్న కరెంటు చౌర్యంతో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు భారీగా నష్టం వాటిల్లుతోంది.

Published : 29 Mar 2023 05:17 IST

 చౌర్యంతో సంస్థ ఖజానాకే కన్నం
ఒకే మీటరు నంబరుతో అక్రమాలు
14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, డీఈ, మీటర్‌ రీడర్లపై చర్యలకు ఎస్‌పీడీసీఎల్‌ ఉత్తర్వులు
ఈనాడు - హైదరాబాద్‌

ఇంటి దొంగల సహకారంతో యథేచ్ఛగా సాగుతున్న కరెంటు చౌర్యంతో విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు భారీగా నష్టం వాటిల్లుతోంది. క్షేత్రస్థాయిలో మీటర్‌ రీడింగ్‌ పక్కాగా నమోదు చేయాల్సిన మీటర్‌ రీడర్లు, వారిని పర్యవేక్షించాల్సిన సహాయ ఇంజినీర్లు(ఏఈ), సహాయ డివిజనల్‌ ఇంజినీర్లు(ఏడీఈ), డివిజనల్‌ ఇంజినీర్లు(డీఈ) సహా అందరూ అవినీతికి పాల్పడుతుండటంతో డిస్కంల ఆదాయానికి పెద్దఎత్తున నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) అంతర్గత విచారణలో బయటపడింది. నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ విద్యుత్‌ డివిజన్లలో ఒకే మీటరు నంబరుతో వేల సంఖ్యలో కనెక్షన్‌లిచ్చారని, వాటి బిల్లుల సొమ్మును స్వాహా చేస్తున్నారంటూ జి.సత్యనారాయణ అనే న్యాయవాది ఈఆర్‌సీ దృష్టికి తేవడంతో ఇటీవల విచారణ చేయించింది. దక్షిణ తెలంగాణ డిస్కం(ఎస్‌పీడీసీఎల్‌) విజిలెన్స్‌ అధికారులు 2,783 కరెంటు కనెక్షన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. వీటిలో 2,101 కనెక్షన్లకు అసలు మీటర్లే పెట్టకుండా విద్యుత్‌ వాడుకుంటున్నట్లు తేలింది. వీటి వల్ల నెలకు రూ.9.32 లక్షల నష్టం వాటిల్లుతున్నట్లు విజిలెన్స్‌ అధికారులు తేల్చారు. మిగతా సర్వీసులను జిల్లా అధికారులతో ‘సెక్షన్‌ ఆటోమేషన్‌’(సాసా) మొబైల్‌ యాప్‌లో ఫొటోలు తీయించి తనిఖీ చేయించగా.. వాటికీ మీటర్లు లేవని తేలడంతో విస్తుపోయారు. మొత్తం 10,783 కనెక్షన్లలో 4,842 సర్వీసులకు మీటర్లు పెట్టకుండా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నట్లు తనిఖీల్లో గుర్తించామని ఈఆర్‌సీ ఛైర్మన్‌ శ్రీరంగారావు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎవరైనా సిబ్బంది అవినీతికి పాల్పడితే ఈఆర్‌సీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు ఆయన సూచించారు. అక్రమాలకు సహకరించినందుకు 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, ఒక డీఈ, సంబంధిత ప్రైవేటు మీటర్‌ రీడర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ నాగర్‌కర్నూల్‌ జిల్లా విద్యుత్‌ అధికారికి డిస్కం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి ఎక్కడైనా కరెంటు మీటరు పెట్టలేదని తేలితే సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అన్ని సర్కిళ్ల అధికారులకు ఆదేశాలిచ్చింది. మీటరు లేకుండా కరెంటు వాడుకునేవారి నుంచి జరిమానా వసూలు చేయడమే కాకుండా కొత్త మీటరు పెట్టడానికి అదనంగా సొమ్ము వసూలు చేయాలని స్పష్టంచేసింది.

అక్రమాలకు తెరతీశారిలా..

సాధారణంగా కరెంటు కనెక్షన్‌ ఇచ్చినప్పుడు మీటరు ఏర్పాటు చేస్తారు. మీటరు నంబరు, కరెంటు కనెక్షన్‌ నంబరు వేర్వేరుగా ఉంటాయి. వినియోగదారులు కనెక్షన్‌ నంబరు ఆధారంగా నెలనెలా బిల్లులు చెల్లిస్తారు. మీటరు నంబరు గురించి పట్టించుకోరు. అధికారులు తెలిపిన ప్రకారం ఇప్పుడు జరిగిందేమిటంటే ఒకే మీటరు నంబరుతో పలువురికి కనెక్షన్లు ఇచ్చారు. ఆ మీటరుకు సంబంధించి ఎవరో ఒకరికే బిల్లు వెళ్తుంది. మిగిలిన వారి ఇళ్లకు వెళ్లి ప్రైవేటుగా డబ్బులు వసూలు చేసుకున్నారు.

ఇక నుంచి ఏఈ ఆమోదిస్తేనే బిల్లు

డిస్కం నిబంధనల ప్రకారం కరెంటు మీటర్ల రీడింగ్‌ను ప్రతినెలా ప్రైవేట్‌ సంస్థకు చెందిన మీటర్‌ రీడర్లు నమోదు చేసి.. బిల్లులు జారీ చేయాలి. వీరు సక్రమంగా పనిచేస్తున్నారో, లేదో తనిఖీ చేయడానికి రెండు నెలలకోసారి స్థానిక విద్యుత్‌ అధికారులు నేరుగా వెళ్లి రీడింగ్‌ తీసుకోవాలి. ఇది సక్రమంగా జరగడం లేదని గుర్తించిన డిస్కం.. ‘సాసా’ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఇందులో కరెంటు మీటర్‌ను ఫొటో తీయగానే రీడింగ్‌ నమోదై.. సంబంధిత ఏఈ ఫోన్‌కు వెళ్తుంది. దాన్ని ఏఈ తనిఖీ చేసి.. ఆమోదిస్తేనే కరెంటు బిల్లు జారీ అవుతుంది. ఇక నుంచి దీన్ని కచ్చితంగా అమలు చేయాలని డిస్కం నిర్ణయించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని