మెట్రో రెండోదశ ఎందుకు సాధ్యం కాదు?

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు.

Updated : 29 Mar 2023 06:57 IST

ఆమోదించాలని కోరుతూ కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

ఈనాడు- హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పదే పదే అన్యాయం చేస్తోందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ.. కేంద్రం చేతులెత్తేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీకి మంగళవారం ఒక లేఖ రాశారు. ఇప్పటికే అనేకసార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైలు రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతో పాటు.. ప్రాజెక్టు సవివర నివేదిక (డీపీఆర్‌) సైతం పంపించామన్నారు. సంబంధిత వివరాలను ఈ సందర్భంగా కేటీఆర్‌ జతచేశారు. మరోసారి కూడా సమగ్ర సమాచారాన్ని, అన్ని రకాల పత్రాలను, నివేదికలను కేంద్రానికి పంపుతున్నట్లు పేర్కొన్నారు.

చిన్న నగరాలకు ఎలా సాధ్యం?

‘‘అత్యంత రద్దీ కలిగిన హైదరాబాద్‌లో మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ సాధ్యం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. తమకు అనుకూలమైన నగరాలకు మాత్రం పక్షపాత ధోరణితో మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తోంది. గాంధీనగర్‌, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా కలిగిన లక్‌నవూ, వారణాసి, కాన్పూర్‌, ఆగ్రా, ప్రయాగ్‌రాజ్‌, మేరట్‌ వంటి ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించింది. ఇలాంటి నగరాలకు మెట్రో రైలుకు అన్ని అర్హతలు ఉన్నాయని పేర్కొన్న కేంద్రం.. హైదరాబాద్‌లో విస్తరణకు అర్హత లేదని చెప్పడం అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రో నగరం హైదరాబాద్‌. ఇలాంటి నగరంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందన్న వాదన అర్థరహితం. 

ఎన్నిసార్లు ప్రయత్నించినా స్పందన లేదు    

తెలంగాణకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నా వివిధ రంగాల్లోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేకసార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రిగా నేను స్వయంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీని వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అనేకసార్లు ప్రయత్నించినా మంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం..ముఖ్యంగా పట్టణాభివృద్ధి శాఖ హైదరాబాద్‌ నగర మౌలిక వసతుల ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా, అవసరాలే ప్రాతిపదికగా సరైన నిర్ణయం తీసుకొని ప్రాజెక్టులు కేటాయిస్తారని ఆశించాం. ఇప్పటికైనా హైదరాబాద్‌ నగర మెట్రో రైలు ప్రాజెక్ట్‌ రెండో దశ ప్రతిపాదనలో ఉన్న సానుకూలతలను దృష్టిలో ఉంచుకొని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదముద్ర వేస్తుందని ఆశిస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని కేటీఆర్‌ తన లేఖలో హర్‌దీప్‌సింగ్‌ పూరీకి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని