త్వరలో ఆర్‌ఆర్‌ఆర్‌ బృందానికి ఘన సత్కారం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఇటీవల భారతీయ సినిమాకు ‘ఆస్కార్‌’ రావడం, అందులో తెలుగుకు దక్కడం, దీనికి మూలస్తంభం తెలంగాణ బిడ్డ చంద్రబోస్‌ కావడం ఎంతో గర్వంగా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కొనియాడారు.

Published : 29 Mar 2023 04:41 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: ఇటీవల భారతీయ సినిమాకు ‘ఆస్కార్‌’ రావడం, అందులో తెలుగుకు దక్కడం, దీనికి మూలస్తంభం తెలంగాణ బిడ్డ చంద్రబోస్‌ కావడం ఎంతో గర్వంగా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ కొనియాడారు. మంగళవారం సాయంత్రం రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ, కవులు, రచయితలు, సాహితీవేత్తల ఆధ్వర్యంలో చంద్రబోస్‌ను ఘనంగా సత్కరించారు. సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. ‘గతంలో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ కవులను ప్రపంచానికి సమున్నతంగా పరిచయం చేశారు. ఇప్పుడు చంద్రబోస్‌ విశ్వవేదికపై సత్తా చాటారు. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారీ స్థాయిలో సత్కరిస్తాం. సీఎంతో కేసీఆర్‌తో మాట్లాడి ఎప్పుడనేది నిర్ణయం తీసుకుంటాం’ అని తెలిపారు. నటుడు ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ... రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి సత్కారసభను ఏర్పాటు చేయాలని కోరారు. చంద్రబోస్‌ స్పందిస్తూ... రాసినప్పుడు మాత్రమే కవి కాదని, రాయనప్పుడు కూడా కవిగా ఉండేవాడే అరుదైన విజయాలకు అర్హుడన్నారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, చంద్రబోస్‌ తండ్రి నరసయ్య, వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు నవీనాచారి, బడేసాబ్‌, రామకృష్ణ చంద్రమౌళి, వెంకటనారాయణ, రాయారావు సూర్యప్రకాశ్‌రావు, మూర్తి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని