రంగంలోకి కేంద్ర నిఘా సంస్థ.. డేటా లీకేజీ వ్యవహారంలో మలుపులు

సంచలనం సృష్టిస్తున్న డేటా లీకేజీపై కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) దృష్టి సారించింది. రక్షణశాఖతో పాటు అనేక విభాగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 16.8 కోట్ల మందికి సంబంధించిన డేటా బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.

Updated : 29 Mar 2023 04:40 IST

ఈనాడు, హైదరాబాద్‌: సంచలనం సృష్టిస్తున్న డేటా లీకేజీపై కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) దృష్టి సారించింది. రక్షణశాఖతో పాటు అనేక విభాగాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 16.8 కోట్ల మందికి సంబంధించిన డేటా బహిరంగ మార్కెట్‌లో అమ్మకానికి పెట్టడం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో ఏమైనా ఉగ్రకోణం ఉండొచ్చన్న అనుమానంతో ఐబీ రంగంలోకి దిగింది. ఇప్పటికే సైబరాబాద్‌ అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్న కేంద్ర నిఘా సంస్థ ప్రతినిధులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు త్వరలో ఇక్కడకు రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉగ్రకోణం ఉన్నట్లు తేలితే కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌.ఐ.ఎ.)కి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ఏడుగురు సభ్యుల ముఠాను ఇటీవల సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల్లో అనేక ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర రాష్ట్రాల వారూ ఉండటంతో కేంద్ర నిఘా సంస్థ దృష్టి సారించింది. ఇంత పెద్ద రాకెట్‌ను పట్టుకున్నందుకు వారిని ఈసంస్థ అధికారులు అభినందిస్తున్నారు.

మరోమారు రక్షణశాఖ బృందం రాక!

రక్షణ శాఖకు చెందిన 2.55 లక్షల మందికి సంబంధించిన సమాచారం లీకవ్వడాన్ని ఆ మంత్రిత్వశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇందుకోసం ఒక ప్రత్యేక బృందం ఇప్పటికే రంగంలోకి దిగి పలుమార్లు సైబరాబాద్‌ పోలీసులతో సమావేశమైంది. త్వరలో మరోమారు ఇక్కడకు రాబోతోంది. దిల్లీలోని బ్యాంకులు, విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డేటా కూడా లీకవ్వడంతో అక్కడి పోలీసులు సైబరాబాద్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరితోపాటు ఇంకా కొన్ని రాష్ట్రాల పోలీసులూ సైబరాబాద్‌ పోలీసులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు