మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శం

మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Published : 29 Mar 2023 04:38 IST

ఈ విభాగంలో మూడో స్థానానికి చేరుకున్నాం
హైదరాబాద్‌లో మూడు 200 పడకల ఎంసీహెచ్‌లు నిర్మిస్తాం
నిమ్స్‌లో ఎంసీహెచ్‌   శంకుస్థాపనలో మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు మహిళలకు అన్ని రకాల వైద్య సేవలను ఒకేచోట అందించి, తల్లీబిడ్డల ఆరోగ్యాలకు భరోసా ఇచ్చేలా వీటిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో రాష్ట్రంలోనే మొదటి 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్‌) సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం 100 పడకల డయాలసిస్‌ యూనిట్‌ను, రూ.9 కోట్ల విలువైన ఎంఆర్‌ఐ యంత్రం సేవలనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘తెలంగాణ రాక ముందు ప్రతి లక్ష ప్రసవాల్లో తల్లుల మరణాలు 92 ఉండగా వాటిని 43కు, శిశు మరణాలను 36 నుంచి 21కి తగ్గించి, దేశంలో మూడో స్థానానికి చేరుకున్నాం. సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలతో మొదటి స్థానానికి వస్తాం. గర్భిణులు ఎదుర్కొంటున్న కిడ్నీ, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలకు చికిత్స అందించేందుకు సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మిస్తున్నాం. నిమ్స్‌లో ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాన్ని భవిష్యత్తులో ఎనిమిది అంతస్తులకు విస్తరిస్తాం. త్వరలో గాంధీ(సికింద్రాబాద్‌), టిమ్స్‌(అల్వాల్‌)ల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తాం. ఇవి ఉమ్మడి రాష్ట్రంలో మూడే ఉండగా తెలంగాణ వచ్చాక 27కు పెరిగాయి. నిమ్స్‌లో ప్రస్తుతం 1,600 పడకలున్నాయి. మరో 2వేల పడకలకు విస్తరించే పనులకు సీఎం కేసీఆర్‌ త్వరలో శంకుస్థాపన చేస్తారు. నిమ్స్‌ అభివృద్ధికి, ఆధునిక పరికరాల కొనుగోలుకు రూ.150 కోట్లు కేటాయించారు. ఎర్రమంజిల్‌లోని క్వార్టర్స్‌ భూములను ఇటీవల నిమ్స్‌కు బదలాయించారు.

100 పడకల డయాలసిస్‌ యూనిట్‌ ప్రారంభం

దేశంలోనే తొలిసారి 100 పడకలతో డయాలసిస్‌ యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు నిమ్స్‌లో రోజుకు 634 మందికి డయాలసిస్‌ జరిగేది. ఇకపై 1,500 మందికి ఈ సేవలు అందుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో డయాలసిస్‌ కేంద్రాలు మూడే ఉండేవి. ఇప్పుడు 103కి పెంచుకున్నాం. నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ అమలులో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నట్లు తెలిసింది. వాటిని సరిదిద్దుతాం. ఇక్కడ ఓపీ సమయం ముగిసినా సేవలందిస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పిస్తాం. ఆస్పత్రి ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ బీరప్ప బాగా పనిచేస్తున్నారు’’ అని ప్రశంసించారు. అనంతరం నిమ్స్‌లో పనిచేసేందుకు 26 మంది సహాయ ఆచార్యులకు నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ శ్వేతా మహంతి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి, నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ బీరప్ప, మెడికల్‌ సూపరింటెండెంట్‌ నిమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు