అన్నదాతకు కరవైన ఇంధనం

సహకార సంఘాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు రైతులకు స్థానికంగా ఇంధన సేవలు, స్థానికులకు ఉపాధి అందించేందుకు 2018లో రాష్ట్రవ్యాప్తంగా 89 ప్రాథమిక సహకార సంఘాల్లో పెట్రోలు బంక్‌లు ఏర్పాటయ్యాయి.

Published : 29 Mar 2023 04:38 IST

వినియోగ బంక్‌లకు సబ్సిడీలు ఎత్తివేసిన కేంద్రం
నష్టాలతో నడపలేక మూతపడ్డ వైనం

ఈనాడు, హైదరాబాద్‌: సహకార సంఘాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు రైతులకు స్థానికంగా ఇంధన సేవలు, స్థానికులకు ఉపాధి అందించేందుకు 2018లో రాష్ట్రవ్యాప్తంగా 89 ప్రాథమిక సహకార సంఘాల్లో పెట్రోలు బంక్‌లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 38 బంక్‌లు ఏర్పాటు కాగా.. వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో అయిదు నుంచి పది సొసైటీలు వీటిని స్థాపించాయి. ఆయా సొసైటీలు సొంత వనరులతో పాటు డీసీసీబీలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రూ.50 లక్షలను వెచ్చించి బంక్‌లను ఏర్పాటు చేశాయి. 2018 సమయంలో కేంద్రం వీటిని వినియోగ బంక్‌లుగా పరిగణించి, తక్కువ ధరకు పెట్రోలు, డీజిలు సరఫరా చేసేది. దీంతో వాణిజ్య బంక్‌ల కంటే ధరలు తక్కువగా ఉండేవి. గ్రామాల పరిధిలో బంక్‌లు అందుబాటులోకి రావడంతో రైతులకు సౌలభ్యంగా ఉండేది. పెట్రోలు, డీజిల్‌లపై పన్నులు చెల్లించే అవసరం లేకపోవడం వల్ల బంక్‌ల వ్యాపారం లాభదాయకంగా మారింది. వీటిని చూసి రాష్ట్రవ్యాప్తంగా మరో 193 సొసైటీలు బంక్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

కరోనా తర్వాత...

కరోనా అనంతరం 2021లో కేంద్ర ప్రభుత్వం వినియోగ బంక్‌లలో పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీని ఎత్తివేయడం వాటికి శరాఘాతంగా మారింది. రాయితీ తొలగించిన అనంతరం వాణిజ్య బంక్‌ల కంటే అధిక ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు సొసైటీల బంక్‌లకు రావడం మానేశారు. కొన్ని బంక్‌లు నష్టాన్ని భరించి విక్రయాలను జరపడంతో వాటిపై పెనుభారం పడింది. అనంతరం ఒక్కొక్కటిగా 40 బంక్‌లు మూతపడ్డాయి. గత మార్చి నుంచి ఇప్పటివరకు ఏడాది కాలంగా మూతపడడంతో అవి ఆదాయం కోల్పోయాయి. మరోవైపు రైతులు పెట్రోలు, డీజిల్‌ల కోసం సమీప పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్తున్నారు.


ది కరీంనగర్‌ జిల్లాలోని దుర్శేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పెట్రోలు బంక్‌. రైతులకు తక్కువ ధరలకు పెట్రోలు, డీజిల్‌ సరఫరా కోసం 2018లో దీనిని ప్రారంభించారు. కానీ నాలుగేళ్లలోనే మూతపడింది. రూ.50 లక్షల పెట్టుబడి రాకపోగా.. కొత్తగా రూ.20 లక్షల నష్టం వచ్చింది.. ఇదొక్కటే కాదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తివేయడం వినియోగ(కన్సూమర్‌) బంక్‌లకు శాపంగా మారింది. దీంతో పలు బంక్‌లు వరుసగా మూతపడుతున్నాయి.


రైతులకు ఇబ్బందికరమే

సొసైటీల పెట్రోలు బంక్‌లు మాకు ఉపయోగపడ్డాయి. ట్రాక్టర్లు.. హార్వెస్టర్లకు తక్కువ ధరకు డీజిల్‌ వచ్చేది. ఇంధనం కోసం 50 కిలోమీటర్లు వెళ్లే సమస్య ఉండేది కాదు. ఏడాది కిందట సొసైటీల బంక్‌లు మూతపడడంతో మాకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే మాకు కూలీలు, పెట్టుబడుల ఖర్చులు పెరిగాయి. కేంద్రం రైతులకు మేలు చేయాలనుకుంటే ఈ బంక్‌లకు సబ్సిడీలు ఇవ్వాలి.

రాయిని వెంకట్‌, మొలంగూర్‌, కరీంనగర్‌ జిల్లా


కేంద్ర నిర్ణయమే శాపం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్‌ బంక్‌ల ఏర్పాటు.. సొసైటీలతో పాటు రైతులకు లబ్ధి చేకూరింది. కరోనా అనంతరం కేంద్రం వీటిపై సబ్సిడీలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బంక్‌లన్నీ నష్టాల్లో మునిగాయి. ఈ సమస్యను దిల్లీకి వెళ్లి కేంద్ర సహకారశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విన్నవించాను. సబ్సిడీల విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.. కానీ నిర్ణయం తీసుకోలేదు.

టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు