పేదప్రజలకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వ చర్యలు

రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించి, వారి ఆరోగ్యానికి బాటలు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు.

Published : 29 Mar 2023 05:15 IST

ఏప్రిల్‌ నుంచి మరో ఏడు జిల్లాలు, అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు బలవర్ధక బియ్యం
మంత్రి గంగుల కమలాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పేద ప్రజలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించి, వారి ఆరోగ్యానికి బాటలు వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి మరో ఏడు జిల్లాల్లోని రేషన్‌కార్డుదారులకు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకాలకు బలవర్ధక(ఫోర్టిఫైడ్‌) బియ్యం అందించనున్నట్లు తెలిపారు. తాజాగా ఎంపిక చేసినవాటిలో సిరిసిల్ల, కరీంనగర్‌, హనుమకొండ, మంచిర్యాల, నిర్మల్‌, ఖమ్మం, వికారాబాద్‌ జిల్లాలు ఉన్నాయన్నారు. బలవర్ధక బియ్యం పంపిణీ ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ‘రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లో బ్లెండింగ్‌ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఎఫ్‌సీఐకి సీఎంఆర్‌లో భాగంగా 35 లక్షల టన్నుల బలవర్ధక బియ్యాన్ని అందించగా, రాష్ట్రంలో ప్రజాపంపిణీ అవసరాల కోసం 11 లక్షల మెట్రిక్‌ టన్నులను ఇప్పటికే సేకరించాం. ఈ బియ్యాన్ని ఏప్రిల్‌లో 11 జిల్లాల లబ్ధిదారులకు అందిస్తాం. మిగతా జిల్లాలవారికి విడతలవారీగా 2024 మార్చి వరకు పంపిణీకి చర్యలు చేపడతాం’ అని గంగుల వివరించారు. 2021 సెప్టెంబరులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో బలవర్ధక బియ్యం పంపిణీ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఆ తర్వాత 2022 మే నుంచి కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పంపిణీ జరుగుతోంది. తాజాగా ఎంపిక చేసిన ఏడింటిని కలిపితే మొత్తం జిల్లాల సంఖ్య 11కి చేరుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు