నిబంధనలు రాలేదు.. నిధులు కదల్లేదు..

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. నూతన నిబంధనలు వెల్లడి కాకపోవడమే దీనికి కారణం.

Published : 30 Mar 2023 05:55 IST

ఖర్చు కాని రూ.4,300 కోట్లు
దళితబంధు పథకం తీరిది..
ఏప్రిల్‌ 14న కొత్త విధాన ప్రకటన!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు, ఎంపిక ప్రక్రియ నిలిచిపోయింది. నూతన నిబంధనలు వెల్లడి కాకపోవడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ.4000 కోట్లు పీడీ ఖాతాలో, రూ.300 కోట్లు బ్యాంకు ఖాతాలో ఉన్నప్పటికీ నియోజకవర్గానికి 500 మంది చొప్పున లబ్ధిదారులకివ్వాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఇంతవరకు లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేయగా.. ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేస్తూ వచ్చింది. ఎంపికకు ఎమ్మెల్యేల సిఫార్సులు అవసరం లేదని ఆరు నెలల కిందట హైకోర్టు స్పష్టం చేయడంతో నూతన ఎంపిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. దీంతో కొత్త లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది.

ఎమ్మెల్యేల ప్రమేయంపై అభ్యంతరాలు

దళితబంధు ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 38,801 యూనిట్లు మంజూరు చేసింది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున రూ.3,880 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఒక్కో నియోజకవర్గంలో తొలుత 1,500 మందికి యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, రూ.17,700 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ఎంపిక చేయాలని నిర్ణయించింది. దళితబంధులో ఎమ్మెల్యేల ప్రమేయంతో తమ పేర్లు జాబితా నుంచి తొలగించారని కొందరు హైకోర్టుకు వెళ్లగా.. ఎమ్మెల్యేల సిఫార్సులు అక్కర్లేదని కోర్టు తెలిపింది. లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల అనుచరులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, కొన్నిచోట్ల అనుచరులే యూనిట్లు తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారాలపై సీఎం కేసీఆర్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక విధానం అవసరమని ఎస్సీ సంక్షేమశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపింది. ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా.. ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తులు తీసుకుని అత్యంత పేదలకు తొలి ప్రాధాన్యమివ్వాలన్నది ప్రభుత్వ యోచన. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కొత్త విధివిధానాలు వెల్లడయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని