1 నుంచి టోల్‌ పెంపు

జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను కేంద్రం 5% పెంచింది. ఈ ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Updated : 30 Mar 2023 06:54 IST

జాతీయ రహదారులపై 5% పెరిగిన ఛార్జీలు
హైదరాబాద్‌ నుంచి విజయవాడ ఒకవైపు ప్రయాణానికే రూ.15 పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను కేంద్రం 5% పెంచింది. ఈ ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఏ), స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) గణాంకాల ఆధారంగా ఏటా ఏప్రిల్‌ 1న టోల్‌ ఛార్జీలను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పెంచుతోంది. సొంత కారులో 24 గంటల వ్యవధిలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు జాతీయ రహదారి 65 మీదుగా వెళ్లి రావడానికి వాహనదారులు ప్రస్తుతం రూ.465 టోల్‌ చెల్లిస్తున్నారు.  శనివారం నుంచి రూ.490 చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.25 పెరిగింది. ఈ మార్గంలో పంతంగి, కొర్లపహాడ్‌, చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి. ఒకవైపు ప్రయాణానికి ప్రస్తుతం రూ.310 చెల్లిస్తుండగా ఇకపై రూ.325 చెల్లించాల్సి ఉంటుంది. మినీబస్సులు, లైట్‌ మోటార్‌ వాణిజ్య, సరకు రవాణా వాహనాలు, భారీ, అతి భారీ వాహనాలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తానికి అదనంగా 5 శాతం  వసూలు చేయనున్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ, బెంగళూరు, డిండి, యాదాద్రి, వరంగల్‌, భూపాలపట్నం, నాగ్‌పుర్‌, పుణె తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు జాతీయ రహదారులు ఉన్నాయి. తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు పది జాతీయ రహదారులు ఉన్నాయి. ఆయా రహదారులపై తెలంగాణ పరిధిలో 32 టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-వరంగల్‌ మార్గాల్లో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని