సంక్షిప్త వార్తలు(6)

రాష్ట్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్లను తక్షణం నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం హైకోర్టులో సుపరిపాలన వేదిక పిటిషన్‌ దాఖలుచేసింది.

Updated : 30 Mar 2023 06:50 IST

సమాచార కమిషనర్లను నియమించాలని హైకోర్టులో పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషనర్లను తక్షణం నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం హైకోర్టులో సుపరిపాలన వేదిక పిటిషన్‌ దాఖలుచేసింది. ప్రధాన సమాచార కమిషనర్‌ పోస్టు రెండేళ్ల నుంచి, కమిషనర్‌ పోస్టులు గత నెల 24 నుంచి ఖాళీగా ఉన్నాయని.. దాంతో సమాచార కమిషన్‌లో అప్పీళ్లపై విచారణలు నిలిచిపోయాయని తెలిపింది. సమాచార హక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేనందునే ఈ పోస్టులను భర్తీ చేయడం లేదని వేదిక కన్వీనర్‌ పద్మనాభరెడ్డి తెలిపారు. సహ చట్టం అమలు కాకపోతే పరిపాలనలో పారదర్శకత ఉండదని ఆయన తెలిపారు.


స్వప్నలోక్‌ అగ్నిప్రమాదంపై సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌, అగ్నిమాపక శాఖ డైరెక్టర్‌ జనరల్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను చేర్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టనుంది.


బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని బీసీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులు ఏప్రిల్‌ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు బీసీ గురుకుల వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.


ఓటర్లు కాని వారిని అనుమతించవద్దు: బార్‌ కౌన్సిల్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల అధికారులు నియమావళిని కఠినంగా అమలు చేయాలని బార్‌ కౌన్సిల్‌ సూచించింది. ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే ఓటింగ్‌ జరిగే ప్రాంతానికి ఓటర్లు కాని వారిని అనుమతించరాదని చెప్పారు. ఐడీ కార్డులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగడానికి న్యాయవాదులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


రెండు కొత్త సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరో రెండు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని మూడు మండలాలను కలుపుతూ కొత్తగా పటాన్‌చెరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని..పెద్దపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని మూడు మండలాలను విడగొట్టి కొత్తగా రామగుండం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని నెలకొల్పారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.


ముగిసిన సైబర్‌ అంబాసిడర్‌ కార్యక్రమం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల్లో సైబర్‌ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం చేపట్టిన సైబర్‌ అంబాసిడర్‌ కార్యక్రమం ముగింపు సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్రంలోని 1,603 పాఠశాలలకు చెందిన 6,412 మంది విద్యార్థులను సైబర్‌ అంబాసిడర్లుగా ఎంపిక చేసి వారికి గత జనవరి 11వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చారు. మొత్తం 33 జిల్లాలకు చెందిన ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ పాఠశాలలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. సైబర్‌ నేరాలు జరిగే తీరు, వాటి ఉచ్చులో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను అంబాసిడర్లకు బోధించారు. ప్రస్తుతం శిక్షణ పొందిన విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లోని మిగిలిన విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమ ముగింపు సమావేశాలకు ఆయా జిల్లాల్లోని షి టీమ్స్‌ అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షీకా గోయల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని