వైభవంగా సీతారాములవారి ఎదుర్కోలు ఉత్సవం

జగదానందకారకుడైన రాముడు పెళ్లికొడుకయ్యాడు. కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల   క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.

Updated : 30 Mar 2023 06:42 IST

నేడు భద్రాద్రిలో జగత్కల్యాణం
ఏర్పాట్లు పూర్తి

భద్రాచలం, న్యూస్‌టుడే: జగదానందకారకుడైన రాముడు పెళ్లికొడుకయ్యాడు. కల్యాణ ఘడియలు సమీపించడంతో భద్రాచల   క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం అంబరాన్ని తాకింది. స్వామివారి మూర్తులను ఊరేగింపుగా కోవెల వెలుపలికి తీసుకొచ్చారు. మార్గమధ్యలోని శ్రీరామాయణ మహాక్రతువు యాగశాల వద్ద రాములవారు ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం ఉత్తర ద్వారం వద్ద వేడుక నిర్వహించారు. సీతారాముల వారి గుణశీలాలను స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితులు మురళీకృష్ణమాచార్యులు వివరిస్తూ చేసిన సంవాదం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. స్వామివారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్‌లు పట్టు వస్త్రాలను సమర్పించారు. పూల దండలతో వైదిక సిబ్బంది నృత్యాలు చేసి ఉత్సవ శోభను పెంచారు. తిరు వీధి సేవ నిర్వహించారు. కలెక్టర్‌ అనుదీప్‌, ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాలను మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు తిలకించారు.

నేడు కల్యాణ మహోత్సవం: శ్రీరామనవమి సందర్భంగా గురువారం సీతారాముల కల్యాణ మహోత్సవం జరగనుంది. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తలుపులు తెరిచి సుప్రభాత సేవ, తిరువారాధన అనంతరం ఉదయం 4 నుంచి 5 గంటల వరకు మూలవరులకు అభిషేకం చేస్తారు. 8 నుంచి 9 వరకు ధ్రువమూర్తుల కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కల్యాణ మూర్తులకు అలంకారం చేసి ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకువెళ్తారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సీతారామ కల్యాణోత్సవం ఉంటుంది. ఈ వేడుకకు సంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలను తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఆ విషయంలో స్పష్టత రాలేదు. సీఎం కేసీఆర్‌ రాని పక్షంలో మంత్రులు దీన్ని కొనసాగించే వీలుంది. కల్యాణ మండపంలోని ప్రాంగణాన్ని సెక్టార్లుగా విభజించారు. వేసవి వల్ల ఉక్క పోత సమస్యను తగ్గించేందుకు ఏసీలు, కూలర్లు ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. కల్యాణ శోభతో భద్రాద్రి భక్తాద్రిగా దర్శనమిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు