ఆందోళన వద్దు.. హాయిగా సంసిద్ధం కండి

పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళనకు గురికాకుండా సంసిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

Updated : 30 Mar 2023 05:15 IST

పదో తరగతి విద్యార్థులకు మంత్రి సబిత సూచన
పరీక్షలకు అదనపు సౌకర్యాలు
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళనకు గురికాకుండా సంసిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. పరీక్షలపై విద్యార్థులకున్న సందేహాలను నివృత్తి చేసి, వారిలో మనోధైర్యం నింపాల్సిన బాధ్యత పాఠశాలల యాజమాన్యాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. బుధవారం పాఠశాల విద్య కార్యదర్శి వాకాటి కరుణ, సంచాలకురాలు దేవసేనతో కలిసి మంత్రి సబిత జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని, 2,652 కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్‌టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు.

జిల్లా కలెక్టర్లదే కీలక పాత్ర

‘‘పదో తరగతి పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్లదే కీలకపాత్ర. ఎండల తీవ్రత పెరిగే అవకాశమున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలి. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. సీసీ కెమెరాలు, ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్‌ సరఫరాలో ఆటంకాలు లేకుండా ఆ శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలి. హాల్‌టికెట్లను పాఠశాలలకు పంపించాం. విద్యార్థులు ఆన్‌లైన్లో డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయమూ కల్పించాం. ఈ విద్యాసంవత్సరం నుంచి పరీక్ష పేపర్ల సంఖ్యను 11 నుంచి ఆరుకి తగ్గించాం. సైన్స్‌ పరీక్ష రోజు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు విడివిడిగా అందిస్తాం’’ అని మంత్రి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని