ఇకపై సెల్‌ పోయినా.. దొరుకుతుంది!

చేతిలో సెల్‌ఫోన్‌ లేని వారే కాదు... ఏదో ఒక సందర్భంలో దొంగల కారణంగా దాన్ని పోగొట్టుకోని వారు కూడా ఉండరంటే అతిశయోక్తికాదు.

Updated : 30 Mar 2023 10:32 IST

మొబైల్‌ చోరీలను అరికట్టేందుకు సీఐడీ కసరత్తు
సీఈఐఆర్‌తో ఒప్పందం

చేతిలో సెల్‌ఫోన్‌ లేని వారే కాదు... ఏదో ఒక సందర్భంలో దొంగల కారణంగా దాన్ని పోగొట్టుకోని వారు కూడా ఉండరంటే అతిశయోక్తికాదు. ఒక్క హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోనే సగటున   ఏడాదికి 30 వేలకుపైగా ఫోన్లు చోరీ అవుతుంటాయి.  అందుకే రాష్ట్రంలో సెల్‌ఫోన్‌ దొంగతనాలకు చెక్‌ పెట్టేందుకు సీఐడీ విభాగం కసరత్తు చేస్తోంది. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘సెంట్రల్‌  ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రార్‌ (సీఈఐఆర్‌)’తో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇకపై చోరీకి గురైన ఫోన్‌ను దొంగల నుంచి రికవరీ చేయవచ్చు. ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, బెంగళూరులలో మాత్రమే ఈ విధానం అమలులో ఉంది.

ఒకప్పుడు బస్సులు, రైళ్లలో జేబు దొంగతనాలు జరిగేవి. ఇప్పుడా స్థానాన్ని సెల్‌ఫోన్‌ దొంగతనాలు ఆక్రమించాయి. పర్సు చోరీ చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దొంగలను పట్టుకుంటారు. ఫోన్‌ చోరీపై ఫిర్యాదు చేస్తే.... రసీదు మాత్రమే ఇస్తారు. ఈ దొంగలను పట్టుకునే సాంకేతిక వ్యవస్థ లేకపోవడంతో పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరైనా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడు మాత్రమే ముఠాలను పట్టుకుంటున్నారు. మరోవైపు సెల్‌ఫోన్‌ దొంగతనం వ్యవస్థీకృత నేరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచీ ముఠాలు వస్తున్నాయి. చోరీ చేసిన ఫోన్‌ను దొంగలు వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేస్తారు. దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ విక్రయిస్తారు. లేదంటే అందులోని విడిభాగాలను తీసి ఎగుమతి చేస్తుంటారు. దాంతో పోలీసులు ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటంలేదు. ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్‌ ఎక్కడుందన్నది తెలుసుకోవచ్చు. విడిభాగాలుగా ఊడదీస్తే మాత్రం తెలుసుకోవడం అసాధ్యం. ఇతర రాష్ట్రాల్లో అమ్మితే ఎక్కడుందో తెలుస్తుంది. కానీ... ఒక్క ఫోన్‌ని స్వాధీనం చేసుకోవడానికి అక్కడికి పోలీసు బృందాన్ని పంపడం వ్యయప్రయాసలతో కూడుకుంది.


కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే...

ఫోన్‌ దొంగతనాలకు అడ్డుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సీఈఐఆర్‌ను ప్రారంభించింది. ఫోన్‌ పొగొట్టుకున్న బాధితుడు ఫోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, కేసు నమోదైన తర్వాత సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారు. చోరీ అయిన ఫోన్‌ను ఐఎంఈఐ నంబరు ద్వారా బ్లాక్‌ చేస్తారు. చోరీ చేసిన వ్యక్తి అందులో వేరే సిమ్‌కార్డు వేస్తే మనకు ఆ విషయం తెలిసిపోతుంది. దాని ద్వారా కొత్త సిమ్‌కార్డు చిరునామాను తెలుసుకుని, దొంగను పట్టుకోవచ్చు. ప్రస్తుతం ఐఎంఈఐ నంబరు ద్వారా తమ ఫోన్‌ ఎక్కడుందో బాధితులు సొంతంగా తెలుసుకోగలుగుతున్నా... దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళడానికి వారు జంకుతున్నారు. వీటన్నింటికీ దృష్టిలో ఉంచుకొని సీఐడీ విభాగం సీఈఐఆర్‌తో ఒప్పందం చేసుకుంది. ఇకపై ఫోన్‌ చోరీ కేసులను పోలీస్‌   స్టేషన్లలో నమోదు చేస్తారు. అయితే తప్పుడు ఫిర్యాదులు రాకుండా... ఫోన్‌ కొనుగోలు చేసినప్పటి అసలు రసీదు, వ్యక్తిగత చిరునామా, గుర్తింపు కార్డు, ప్రత్యామ్నాయ ఫోన్‌ నంబరు వంటివి తీసుకుంటారు. ఠాణా నుంచే ఫోన్‌ వివరాలను సీఈఐఆర్‌ వెబ్‌సైట్లో నమోదు చేస్తారు. వెంటనే అది బ్లాక్‌ అవుతుంది. దొంగ ఆ ఫోన్‌ను ఉపయోగించడానికి ఎప్పుడు ప్రయత్నించినా తెలిసిపోతుంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు