పొట్ట దశలోనే తాలు

తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. పొట్టదశలో ఉన్న పంటపై వడగళ్లు పడటంతో గింజదాల్చకముందే దెబ్బతింది.

Published : 30 Mar 2023 05:20 IST

పైరుపై తేలిపోతున్న వరి గింజలు
వడగళ్ల వానతో రైతుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షంతో వరి పంటకు నష్టం వాటిల్లింది. పొట్టదశలో ఉన్న పంటపై వడగళ్లు పడటంతో గింజదాల్చకముందే దెబ్బతింది. వడగళ్ల ప్రభావంతో వరి పైరు గొలుసు బయటికి వచ్చి తాలుగా మారింది. వానలు పడిన 10 రోజుల తర్వాత ఈ ప్రభావం మరింత పెరిగింది. మిగిలిన వరి కంకుల్లోని పాలగింజలు ఎండిపోయి పైరు మీదే తాలుగా మారిపోతున్నాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, హనుమకొండ, ములుగు, జనగామ, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో ఇలా పంట నష్టం పెరుగుతోంది. వేలాది రూపాయలు పెట్టుబడితో సాగుచేసిన పంట మొదట్లోనే దెబ్బతినడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 72,709 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తాజాగా మరో లక్ష ఎకరాల మేరకు నష్టం వాటిల్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వర్షాలకు పంట దెబ్బతినటంతోపాటు దిగుబడి, నాణ్యత తగ్గే ప్రమాదముందని, చీడపీడల సమస్య పెరగనుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగిలో 56,44,850 ఎకరాల్లో వరి పంట సాగవుతోంది. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, సిద్ధిపేట జిల్లాల్లో ఆకుముడత, కాండంతొలిచే పురుగుల ప్రభావం ఉంది. వడగళ్ల వర్షాలకు మరింత నష్టం జరుగుతుండటంతో రైతులు కుంగిపోతున్నారు.


దిగుబడి, నాణ్యతపై ప్రభావం

పైరు మీదే గింజలు తాలుగా మారడం బాధ కలిగిస్తోంది. సర్వేలో భాగంగా అధికారులు వడగళ్లు పడిన రోజు జరిగిన నష్టాన్ని మాత్రమే అంచనా వేశారు. ఆ తర్వాత పంట మరింత దెబ్బతింది. ఇది దిగుబడితోపాటు నాణ్యతపైనా ప్రభావం చూపుతుంది. అధికారులు మరోసారి సర్వే నిర్వహించి ఈ నష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని చెల్లించి ఆదుకోవాలి.

పరుచూరి సుబ్బారావు, రైతు, ఖానాపురం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు