బియ్యం నిల్వ కేంద్రం ఇన్‌ఛార్జి సస్పెన్షన్‌

పేదలకు దక్కాల్సిన రేషన్‌ బియ్యాన్ని మండల స్థాయి నిల్వ కేంద్రానికి (ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌) తరలించకుండానే పక్కదారి పట్టించిన ఉదంతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.

Published : 30 Mar 2023 05:26 IST

‘పక్కదారి పట్టిన బియ్యం’ కేసులో కలెక్టర్‌ చర్యలు

ఈనాడు డిజిటల్‌, పెద్దపల్లి: పేదలకు దక్కాల్సిన రేషన్‌ బియ్యాన్ని మండల స్థాయి నిల్వ కేంద్రానికి (ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌) తరలించకుండానే పక్కదారి పట్టించిన ఉదంతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.. విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో ఈ అక్రమం బయటపడింది.. దీంతో కలెక్టర్‌ సంగీత ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి వెంకట్రాజంను సస్పెండ్‌ చేయడంతోపాటు డాటా ఎంట్రీ ఆపరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డిపై, పొరుగు సేవల ఏజెన్సీపై, రవాణా గుత్తేదారుపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసేలా ఆదేశించారు. విజిలెన్స్‌ అధికారుల కథనం ప్రకారం.. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌ఛార్జి వెంకట్రాజం, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డిలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సుల్తానాబాద్‌లోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో తనిఖీలు చేపట్టారు.  తనిఖీల్లో రూ.38 లక్షల విలువ చేసే 757.27 క్వింటాళ్ల బియ్యం లెక్క తేలకపోవడంతో గోదాంకు రావాల్సిన 2 లారీల బియ్యం రానట్లు గుర్తించారు. 945 బస్తాల్లోని 725 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టాయి. మిగిలిన 32.27 క్వింటాళ్ల బియ్యం ఫోర్టిఫైడ్‌, విద్యార్థులకు పంపిణీ చేసే సన్నబియ్యం అని తేలింది. లారీల యజమానులు లారీలతో పరారీలో ఉన్నారు. వీరిని పట్టుకుని విచారిస్తే అక్రమ దందా గుట్టు రట్టయ్యే అవకాశాలున్నాయి. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. గోదాం ఇన్‌ఛార్జి వెంకట్రాజంను అధికారులు ప్రశ్నిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు