దిశ కేసుపై సెషన్స్‌ కోర్టులో విచారణ జరగాలి

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ సెషన్స్‌ కోర్టులో జరగాలని పోలీసులు బుధవారం హైకోర్టుకు నివేదించారు.

Published : 30 Mar 2023 05:26 IST

హైకోర్టుకు నివేదించిన పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసు విచారణ సెషన్స్‌ కోర్టులో జరగాలని పోలీసులు బుధవారం హైకోర్టుకు నివేదించారు. సంఘటనపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పుర్కర్‌ కమిషన్‌ నివేదికను ప్రామాణికంగా తీసుకుని పోలీసులపై కేసు నమోదు చేయడం సరికాదని తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు, ఇతర పిటిషన్లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పోలీసుల తరఫు సీనియర్‌ న్యాయవాది పి.శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని, మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం సరికాదన్నారు. జస్టిస్‌ సిర్పుర్కర్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను కింది కోర్టులో అవసరమైతే సాక్ష్యాలుగా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు. పోలీసులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కమిషన్‌ నివేదిక ఇవ్వడం సరికాదన్నారు. ఈ సంఘటనకు చెందిన కేసుపై నేరుగా ఉన్నత న్యాయస్థానాలు విచారిస్తే బాధితులు అప్పిలేట్‌ అథారిటీలో వాదనలు చెప్పుకొనే అవకాశం ఉండదన్నారు. దిశ తండ్రి తరఫు సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దిశను నిందితులే హత్య చేశారనడానికి ఆధారాల్లేవని సిర్పుర్కర్‌ కమిషన్‌ తేల్చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి గడువు కోరడంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదో ఒక కారణంతో ప్రతిసారీ వాయిదా కోరడం సరికాదంది. చివరి అవకాశంగా ఏప్రిల్‌ 12కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని