Medicine Prices: మందు బిళ్ల.. జేబు గుల్ల

జలుబు, దగ్గు, జ్వరం, ఎసిడిటీ మాత్రలు మొదలుకొని.. బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె, మూత్రపిండాల జబ్బులు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ఔషధాలన్నీ ఆర్థికంగా మరింత భారం కానున్నాయి.

Updated : 31 Mar 2023 09:35 IST

కేంద్రం ఔషధాల ధరలు పెంచడంతో సామాన్యులపై ఆర్థిక భారం
రేపటి నుంచి 12.12 శాతం పెరగనున్న 857 రకాల మందుల రేట్లు
జలుబు, జ్వరం మాత్రలూ ఇక ప్రియమే..
బీపీ, షుగర్‌, గుండె, మూత్రపిండాల రోగులపై తీవ్ర ప్రభావం

ఈనాడు, హైదరాబాద్‌: జలుబు, దగ్గు, జ్వరం, ఎసిడిటీ మాత్రలు మొదలుకొని.. బీపీ, షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె, మూత్రపిండాల జబ్బులు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ఔషధాలన్నీ ఆర్థికంగా మరింత భారం కానున్నాయి. షెడ్యూల్డ్‌ ఔషధాల పరిధిలోకి వచ్చే 857 రకాల ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే దానికి కారణం. ప్రస్తుతమున్న ధరలపై 12.1218 శాతం పెంచుతూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వస్తాయని ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సాధారణ ఆరోగ్య సమస్యలకు వాడే ఔషధాలు మొదలుకొని.. గుండెపోటు, కిడ్నీ వైఫల్యం, క్యాన్సర్‌ తదితర క్లిష్టమైన వ్యాధుల మందుల ధరలు కూడా పెరగనున్నాయి. గత మూడేళ్లుగా కొవిడ్‌ కాలంలో పెరిగిన ఔషధాల ధరలతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఇప్పటికే కుదేలు కాగా.. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వారిపై మరింత ఆర్థిక భారం మోపనుంది.

అన్నీ అతి ముఖ్యమైన ఔషధాలే..

కేంద్ర ప్రభుత్వం ఔషధాలను రెండు రకాలుగా విభజించింది. అధిక శాతం ప్రజలు ఎక్కువగా వినియోగించే తప్పనిసరి మందులను ‘షెడ్యూల్డ్‌ ఔషధాల’ జాబితాలో చేర్చింది. ఇలాంటివి మొత్తం ఔషధ విపణిలో కేవలం 857(20 శాతమే) రకాలున్నాయి. ఈ మందుల ధరలపై జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ పర్యవేక్షిస్తోంది. తాజాగా ధరలు పెంచిన వాటిని పరిశీలిస్తే.. తట్టు, హెర్పిస్‌ సమస్యల్లో వాడే ‘అసిక్లోవిర్‌’, గొంతునొప్పికి వాడే ‘అమోక్సిసిలిన్‌(ఎ)+క్లావులానిక్‌ యాసిడ్‌(బి), గర్భిణుల్లో రక్త గ్రూపు సమస్యలు ఎదురైనప్పుడు వాడే ‘యాంటీ డి ఇమ్యునోగ్లోబులిన్‌’, ధనుర్వాతానికి వినియోగించే ‘యాంటీ టెటనస్‌ ఇమ్యునోగ్లోబులిన్‌’, ఆస్తమా రోగులకు వాడే ‘బుడెసొనైడ్‌’, కిడ్నీ వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా వాడాల్సిన ‘సైక్లోస్పొరీన్‌’, కిడ్నీ వైఫల్య రోగులు డయాలసిస్‌ చికిత్సలో భాగంగా వినియోగించే ‘ఎరిత్రోపొయిటిన్‌ ఇంజెక్షన్‌’, రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఇచ్చే ‘హెపరిన్‌’ తదితర అనేక అతి ముఖ్యమైన జబ్బుల్లో వాడే ఔషధాలున్నాయి.


రాజేశ్‌(45) ఓ ప్రైవేటు ఉద్యోగి. నెలకు రూ.40 వేల జీతం. బీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్‌ సమస్యలతో బాధపడుతున్నారు. వాటికి నెలకయ్యే మందుల ఖర్చు రూ.3 వేలు. తన అమ్మానాన్నలకయ్యే ఔషధాల వ్యయాన్నీ కలిపితే.. నెలకు కనీసం రూ.10 వేలు కేవలం మందుల కోసమే వెచ్చించాల్సి వస్తోంది. ఆకస్మిక అనారోగ్య సమస్యలొస్తే ఆ ఖర్చులు ఇందుకు అదనం. తన జీతంలో దాదాపు 25 శాతం మందులకే ఖర్చు పెట్టాల్సి వస్తున్న పరిస్థితుల్లో.. ఔషధాల ధరలను దాదాపు 12 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయన లాంటి వారికి ఆర్థికంగా శరాఘాతమే.


ఐపీ రోగుల బిల్లు తడిసి మోపెడవుతుంది

చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే.. ఔషధాల ధరల భారం మోయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ధరలు పెంచిన ఔషధాల్లో అత్యవసర పరిస్థితుల్లో.. ఐసీయూలో ఉంచి చికిత్స అందించాల్సిన రోగులకు వాడాల్సినవి, శస్త్రచికిత్స సమయంలో వాడాల్సినవి అధికంగా ఉన్నాయి. ఇవి ఇప్పటికే ఖరీదైనవి. ఉదాహరణకు గుండెపోటు వచ్చినప్పుడు వినియోగించే ‘అల్టెప్లేజ్‌ 50ఎంజీ’ ఇంజెక్షన్‌ ధర ఇప్పటికే రూ.44 వేలకు పైగా ఉంది. క్యాన్సర్‌ చికిత్సలో వాడే ‘బోర్టెజోమిబ్‌ 2 ఎంజీ’ ఇంజెక్షన్‌ ఖరీదు రూ.13,600. పుట్టుకతో కొందరికి రక్తం గడ్డకట్టని సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి వారిలో ఫ్యాక్టర్‌ 9 లోపం ఉన్నవారికి ‘కోగ్యులేషన్‌ ఫ్యాక్టర్‌ 9’ ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీని 600 ఐయూ ధర ఇప్పటికే రూ.13 వేలకు పైగా ఉంది. తాజా పెంపుతో మరింత ప్రియమవుతాయి. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందేవారి బిల్లు తడిసి మోపెడవుతుంది.

ఆచార్య కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ ఇన్‌ఛార్జ్‌, నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి


సామాన్యులకు భారమే..

ఒకేసారి 12 శాతానికి పైగా మందుల ధరలు.. అందులోనూ షెడ్యూల్డ్‌ ఔషధాల ధరలు పెరగడం సాధారణ రోగులకు ఆర్థికంగా భారమే. బీపీ, షుగర్‌, గుండె, కాలేయ, క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులు క్రమంతప్పకుండా ఔషధాలను వాడాల్సి వస్తుంది. అనారోగ్యాన్ని బట్టి ప్రతినెలా కనీసం రూ.500 నుంచి రూ.1000 వరకూ అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఔషధాల ధరల పెంపు సామాన్యులను ఆర్థికంగా దెబ్బతీస్తుంది. అతి ముఖ్యమైన మందుల ధరలను ప్రభుత్వం నియంత్రణలో ఉంచాలి.

అరుగొండ శ్రీధర్‌, అధ్యక్షుడు, ఔషధ దుకాణదారుల సంఘం, జీహెచ్‌ఎంసీ



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు