నాలుగేళ్లుగా శిక్షణే!

రాష్ట్రంలోని గ్రామాల ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించింది.

Published : 31 Mar 2023 03:31 IST

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామాల ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పెద్దసంఖ్యలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. అయితే ఓ వైపు పనిభారం, మరోవైపు వేతనాలు సక్రమంగా అందక వారు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2019లో 9,355 గ్రామాల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను నియమించింది. వారికి మొదట్లో పే స్కేల్‌ ఇవ్వకుండా రూ.15 వేల కనీస వేతనం ఖరారు చేసిన ప్రభుత్వం 2021లో ఆ వేతనాన్ని రూ.28,719కి పెంచింది. మూడు నెలల పాటు శిక్షణ కాలం (ప్రొబేషనరీ పీరియడ్‌) ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత శిక్షణ కాలాన్ని నాలుగేళ్లకు పెంచింది. పన్నుల వసూలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర గ్రామపంచాయతీ విధులు నిర్వర్తించాల్సిన వీరికి నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల నిర్వహణ, క్రీడా ప్రాంగణాలు, పంచాయతీ ట్రాక్టర్ల పర్యవేక్షణ తదితర బాధ్యతలు అప్పగించింది. ఆ తర్వాత ఉపాధి హామీ పథకంలో తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను బాధ్యతలనూ కట్టబెట్టింది. ప్రస్తుతం దళితబంధు యాప్‌ను కూడా వీరే నిర్వహిస్తున్నారు.ఇందుకు ఉదయం ఏడున్నరకే విధుల్లోకి రావాలని ఇటీవల ఆదేశించింది.

దక్కని పేస్కేల్‌

పనిభారంతో సతమతమవుతున్న తమకు ప్రభుత్వం కనీసం పే స్కేల్‌ను వర్తింపజేయడంలేదని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. పొడిగించిన శిక్షణ కాలం వచ్చే ఏప్రిల్‌ 11తో ముగియనుంది. ప్రొబేషనరీ ముగిసిన తర్వాతనైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి పే స్కేల్‌ వర్తింపజేయాలని కోరుతున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల వేతన బకాయిలు సత్వరమే ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని