క్రమబద్ధీకరణ కల నెరవేరేనా?

ప్రభుత్వ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ.. క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల కల నెరవేరుతుందా? ఆలస్యమవుతుందా? రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాదాపు 5 వేల మంది అధ్యాపకుల్లో ఇదే ప్రశ్న.

Published : 31 Mar 2023 03:31 IST

5 వేల మంది కాంట్రాక్టు అధ్యాపకుల్లో ఉత్కంఠ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తూ.. క్రమబద్ధీకరణకు ఎదురుచూస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల కల నెరవేరుతుందా? ఆలస్యమవుతుందా? రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి దాదాపు 5 వేల మంది అధ్యాపకుల్లో ఇదే ప్రశ్న. రాష్ట్రంలో కాంట్రాక్టు అధ్యాపకులు సహా వివిధ శాఖలకు చెందిన మొత్తం 11,103 మంది కొలువులను క్రమబద్ధీకరిస్తామని గతంలో 2022 మార్చి 9న ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణ అమల్లోకి వస్తుందని 2 నెలల క్రితం ప్రభుత్వం అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది. అయితే దానిపై ఇప్పటివరకు ఉత్తర్వులు వెలువడకపోవడంతో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల్లో ఉత్కంఠ నెలకొంది. అందులో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలకు చెందినవారున్నారు. వారి జాబితాలను 6 నెలల క్రితమే ఆయా విద్యాశాఖ విభాగాలు ప్రభుత్వానికి సమర్పించాయి. కాగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణతోపాటు సెర్ప్‌ ఉద్యోగుల వేతన సవరణ అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఇటీవలే సెర్ప్‌ ఉద్యోగుల వేతన సవరణపై ఉత్తర్వులు జారీఅయ్యాయి. అధ్యాపకుల క్రమబద్ధీకరణపై ఉత్తర్వులు రావాల్సి ఉంది. సీఎం కార్యాలయంలో సంబంధిత దస్త్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నుంచి అమల్లోకి.. అంటే 1వ తేదీనే ఉత్తర్వులు ఇవ్వాలన్నదేమీ లేదని, జీవో ఎప్పుడు ఇచ్చినా 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంటారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని అధ్యాపకులు కోరుతున్నారు. మరోవైపు టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగ పరీక్షల పేపర్‌ లీకేజీతో నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంట్రాక్ట్‌ అధ్యాపకుల క్రమబద్ధీకరణను ప్రభుత్వం ఇప్పుడే పూర్తి చేస్తుందా? అన్న సందేహం కొందరిలో వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు