పెరుగుతున్న ఫీజు బకాయిలు!

రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగియనుంది.

Updated : 31 Mar 2023 04:48 IST

బోధన రుసుములు, ఉపకార వేతనాలకు 12.56 లక్షల మంది దరఖాస్తు
నేటితో ముగియనున్న గడువు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, బోధన రుసుముల దరఖాస్తు గడువు ఈనెల 31తో ముగియనుంది. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు దాదాపు 12.56 లక్షల మంది దరఖాస్తు చేశారు. బోధన రుసుములు, ఉపకార వేతనాల కింద ఇంతవరకు చెల్లించాల్సిన బకాయిలు ప్రస్తుత విద్యాసంవత్సరంతో కలిపి దాదాపు రూ.4 వేల కోట్లకు చేరుకున్నాయి. గత ఏడాదికి సంబంధించిన ఫీజులు ప్రస్తుత విద్యాసంవత్సరంలో పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆమేరకు జరగడం లేదు. ఫీజుల చెల్లింపుల కోసం 2021-22 విద్యాసంవత్సరానికి సంక్షేమ శాఖలు జారీచేసిన టోకెన్లు ఖజానాలో నిలిచిపోయాయి. 2023 మార్చి 31లోగా వాటికి నిధులు విడుదల కాకుంటే.. ఏప్రిల్‌ 1 నుంచి చెల్లుబాటు కాకుండా పోతాయి. దీంతో ఆ బకాయిలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో నూతన టోకెన్లు జారీచేసి, సంక్షేమశాఖల వారీగా ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తరువాతే చెల్లింపులు జరిగే అవకాశాలున్నాయి.

* 2022-23 విద్యాసంవత్సరానికి 13 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. అయితే రెన్యువల్‌ (పునరుద్ధరణ) కింద 8.20 లక్షల మంది అర్హులైన విద్యార్థులుండగా దాదాపు 7.35 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేశారు. కొత్తగా ఈ ఏడాది దరఖాస్తు చేసిన విద్యార్థుల సంఖ్య దాదాపు 5.20 లక్షలకు చేరింది. పలు కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ఉపకార వేతనాలు, బోధన రుసుముల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. ఉపకార వేతనాల కోసం రాష్ట్రంలో 5,572 కళాశాలలు ఈ-పాస్‌లో రిజిస్టర్‌ అయ్యాయి. ఈ కళాశాలలు ఏటా సంబంధిత యూనివర్సిటీలు, బోర్డుల నుంచి అనుమతి పునరుద్ధరణ పత్రాలు అందజేసి నవీకరించుకోవాలి. కొన్ని కళాశాలలు ఈ ప్రక్రియను ఆలస్యం చేయడంతో సంబంధిత విద్యార్థుల దరఖాస్తులు సంక్షేమ శాఖల వద్ద పెండింగ్‌లో ఉంటున్నాయి. ఇప్పటికీ ఇలాంటివి 1,134 కళాశాలలున్నాయి.

* ఉపకారవేతనాలు, బోధన రుసుముల బకాయిలు పెరుగుతున్నాయి. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి బీసీ విద్యార్థుల ఫీజులు దాదాపు రూ.100 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. 2021-22 ఏడాదికి సంబంధించి ఫీజుల డిమాండ్‌ రూ.2,400 కోట్లు ఉంటే.. ఇంతవరకు రూ.1,000 కోట్ల మేర మాత్రమే చెల్లింపులు జరిగాయి. బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖల పరిధిలో నిధుల కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి (2022-23) సంబంధించి ఇంతవరకు ఒక్క రూపాయి విడుదల కాలేదు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో నిధులు విడుదల చేసినప్పటికీ ట్రెజరీ ఆంక్షల కారణంగా విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని